పాక్ 165 ఆలౌట్ లంక 57/1 రెండో టెస్టు

9 Jan, 2014 01:26 IST|Sakshi
హెరాత్

దుబాయ్: శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. లంక బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఖుర్రమ్ మన్‌జూర్ (136 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కుషాల్ సిల్వ (12 బ్యాటింగ్), సంగక్కర (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కరుణరత్నే (32) ఫర్వాలేదనిపించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పాక్ ఓపెనర్లలో మన్‌జూర్ క్రీజులో నిలబడినా... రెండో ఎండ్‌లో సహచరులు షెహజాద్ (3), హఫీజ్ (21), యూనిస్ ఖాన్ (13), మిస్బా (1) క్రమం తప్పకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అర్ధసెంచరీ తర్వాత మన్‌జూర్ కూడా అవుట్ కావడంతో పాక్ 118 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత బిలావల్ భట్టీ (24 నాటౌట్) కాస్తా పోరాడాడు. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రదీప్, హెరాత్ చెరో మూడు, లక్మల్, ఎరంగా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు