దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుపై అభిమానుల ఆగ్రహం

24 Jan, 2018 22:01 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు సఫారి ఆటగాళ్లు పై చేయి సాధించారు. కానీ ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా విభాగం మాత్రం పప్పులో కాలేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్ల సహనానికే పరీక్షగా మారి అర్ధ సెంచరీ సాధించాడు భారత నయావాల్‌ పుజారా. ఈ తరుణంలో పుజారాను అభినందిస్తూ దక్షిణాఫ్రికా బోర్డు చేసిన ట్వీట్‌ భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. 

ఇంతకీ ఏం ట్వీట్‌ చేసారంటే.. ‘పుజారా కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా నెమ్మదిగా 173 బంతుల్లో సాధించాడు. తొలి పరుగుకే 50 బంతులాడిన విషయం తెలిసిందే’  అంటూ పుజారాకు బదులు అశ్విన్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది.

రెండో టెస్ట్‌ సమయంలోనూ భారత కీపర్ పార్థివ్ పటేల్ బదులు సాహా పేరుతో ట్వీట్ చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. సౌతాఫ్రికా చేసిన తాజా తప్పిదంపై భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ట్వీట్ చేసే ముందు కళ్లజోడు పెట్టుకొని చేయాలని ఒకరంటే.. పుజారాలా మాకు ఓపిక ఉంది. చెత్త బంతులు, చెత్త ఫొటోలు వదలకండి అని ఘాటుగా ఇంకొంకరు కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు