డీఎల్‌ఎస్‌ సూత్రధారి లూయిస్‌ ఇక లేరు!

3 Apr, 2020 04:48 IST|Sakshi

లండన్‌: టోనీ లూయిస్‌ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ క్రికెట్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అంటే తెలియని వారుండరు. క్రికెట్‌కు బాగా అక్కరకొచ్చే ‘డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి’ (డీఎల్‌ఎస్‌) సూత్రధారుల్లో టోనీ ఒకరు.  మ్యాచ్‌ ప్రతికూల పరిస్థితుల్లో ఆగిపోతే ఈ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. వర్షంతో ఆగి... సాగే మ్యాచ్‌లకు విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన ఇప్పుడు లూయిస్‌ కన్నుమూశారు. 78 ఏళ్ల టోనీ లూయిస్‌ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది.

ఓ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌ అయిన టోనీ లూయిస్, మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్‌ డక్‌వర్త్‌తో కలిసి ఓ లెక్క తెచ్చారు. ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్‌రేట్, తాజా పరిస్థితి అన్నింటిని లెక్కలోకి తీసుకొని ఓ సారుప్య నిష్పత్తితో గణాంకాలను ఆవిష్కరించారు. ఇది వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన, ఆగి సాగిన ఎన్నో మ్యాచ్‌లకు ఫలితాన్నిచ్చింది. లూయిస్‌ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటీష్‌ ఎంపైర్‌) పురస్కారంతో సత్కరించింది. డీఎల్‌ఎస్‌ రాకముందు అర్ధంతరంగా ఆగే మ్యాచ్‌ల కోసం ఓ మూస పద్ధతిని అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో అత్యధిక సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో... లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది.

1992లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది. దీంతో మెరుగైన కొత్త పద్ధతి కోసం ఐసీసీ అన్వేషించగా... డక్‌వర్త్, లూయిస్‌ ఇద్దరు కలిసి రూపొందించిన పద్ధతి ఐసీసీని మెప్పించింది. దీంతో వారిద్దరి పేర్లతోనే డీఎల్‌ సిస్టమ్‌గా 1997 జనవరి 1నుంచి అమలు చేశారు. నిజానికి ఇదేమీ తేలిగ్గా అర్థమవదు. అయితే పాత పద్ధతి కంటే మేలైనది కావడంతో ఐసీసీకి డీఎల్‌ఎస్‌ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనపడలేదు. తదనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్‌ ప్రొఫెసర్‌ స్టీవెన్‌ స్టెర్న్‌ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014నుంచి డక్‌వర్త్‌–లూయిస్‌–స్టెర్న్‌ (డీఎల్‌ఎస్‌)గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు