టెండూల్కర్‌ డ్రైవ్‌... కోహ్లి క్రెసెంట్‌

16 Jun, 2020 04:32 IST|Sakshi

మెల్‌బోర్న్‌: రియల్‌ ఎస్టేట్‌ మాయలు, జిమ్మిక్కులు ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. తాము డెవలప్‌ చేసినవి అమ్ముకోవాలన్నా, సొమ్ము చేసుకోవాలన్నా... కొనుగోలు దారుల కంట్లో పడాలని ఆసీస్‌ వెంచర్‌ యజమాని మన క్రికెటర్ల పేర్లపై పడ్డాడు. మెల్‌బోర్న్‌లోని రాక్‌బ్యాంక్‌ ప్రాంతంలో అకొలేడ్‌ ఎస్టేట్‌ ఓ వెంచర్‌ని అభివృద్ధి చేసింది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ వెంచర్‌ డైరెక్టర్‌ అక్కడి వీధులకు సచిన్, కోహ్లి, కపిల్‌ దేవ్‌ల పేర్లు పెట్టారు.

టెండూల్కర్‌ డ్రైవ్, కోహ్లి క్రెసెంట్, దేవ్‌ టెర్రస్‌లతో బోర్డులు పాతాడు. అలాగే విదేశీ ఇతర దేశ అభిమానుల కోసం మిగతా వీధులకు వా స్ట్రీట్, మియందాద్‌ స్ట్రీట్, ఆంబ్రోస్‌ స్ట్రీట్, సోబర్స్‌ డ్రైవ్, కలిస్‌ వే అనే పేర్లు పెట్టారు. దీనిపై ఆ వెంచర్‌ డైరెక్టర్‌ ఖుర్రమ్‌ సయీద్‌ మాట్లాడుతూ తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్‌ వీధులకు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల పేర్లకు ఆమోదం కోసం 60 పేర్లతో స్థానిక మెల్టన్‌ కౌన్సిల్‌కు అతను దరఖాస్తు చేశాడు.

మరిన్ని వార్తలు