‘సప్త’ సమరానికి సై!

16 Jun, 2019 05:22 IST|Sakshi
కోహ్లి, పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్, కోచ్‌ ఆర్థర్‌

నేడు భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌

వరల్డ్‌ కప్‌కే ప్రత్యేక ఆకర్షణ 

మరో విజయంపై కోహ్లి సేన గురి

రికార్డును సవరించాలని పాక్‌ ప్రయత్నం

ఈ మ్యాచ్‌కూ వాన గండం

వరుణుడు కరుణిస్తేనే పూర్తి మ్యాచ్‌ సాధ్యం

మధ్యాహ్నం3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

సరిగ్గా నాలుగు నెలల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలభై మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. ఆ దాడి తర్వాత మన దేశంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాల ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఏమైనా సరే పాకిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రం ఆడవద్దంటూ వీరాభిమానుల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు వ్యాఖ్యలు చేశారు. రెండు పాయింట్లు పోయినా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ను బహిష్కరించాల్సిందేనని ప్రముఖులెందరో బహిరంగంగా పిలుపునిచ్చారు.

ఇప్పుడు సమయం గిర్రున తిరిగింది... అసలు జరుగుతుందో లేదో అని సందేహమున్న మ్యాచ్‌కు సర్వం సన్నద్ధమైంది. ఇప్పుడు ఎవరి ఆలోచనల్లోనూ పుల్వామాలు, బాలాకోట్‌లు లేవు... ఉన్నదల్లా క్రికెట్‌ ఒక్కటే. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్ల కొనుగోలు కోసం ఐసీసీ బ్యాలెట్‌ ఓపెన్‌ చేస్తే ఫైనల్‌ మ్యాచ్‌కు 2.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అదే భారత్, పాక్‌ మ్యాచ్‌కు ఏకంగా 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

ఇరు జట్ల కెప్టెన్లు దీనిని ఒక క్రికెట్‌ మ్యాచ్‌గానే చూడండి, ఆటను ఆస్వాదించండి అని గంభీరంగా ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ వారితో పాటు అభిమానులకూ తెలుసు ఇది అన్ని మ్యాచ్‌లలాంటిది కాదని. రెండు దేశాలు మ్యాచ్‌ ఫలితాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయోనని! 41 ఏళ్లలో 131 సార్లు తలపడినా... భారత్, పాక్‌ మ్యాచ్‌ ఏదో రూపంలోనో, మరే కారణంతోనో ఆసక్తి రేపుతూనే ఉంది. ఇప్పుడు విశ్వ వేదికపై దాయాదుల మధ్య ఏడోసారి జరిగే సమరానికి అందరిలో అంతే ఆసక్తి, అదే ఉత్సాహం!  

మాంచెస్టర్‌: రెండేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌... అప్పటి భారత్‌ టీమ్‌ బలాన్ని చూస్తే పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోవడం అనూహ్యం. సరిగ్గా చెప్పాలంటే బలహీనంగా కనిపించిన పాక్‌ను తప్పుగా అంచనా వేసి కోహ్లి సేన బోల్తా కొట్టింది. ఇప్పుడు అదే ఇంగ్లండ్‌లో మరో ఐసీసీ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఈ మధ్య కాలంలో మరో రెండు వన్డేలలో పాక్‌ను భారత్‌ చిత్తు చేసినా... వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ అంటే ఉండే జోష్‌ వేరు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇక్కడి ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో నేడు లీగ్‌ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. మూడు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా విరాట్‌ బృందం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా, ఈ సారైనా భారత్‌పై తమ చెత్త ప్రపంచకప్‌ రికార్డు సరిచేయాలని పాక్‌ ఆశిస్తోంది. అయితే ఇరు జట్లకు ప్రత్యర్థిగా వర్షం మరోవైపు నుంచి వేచి చూస్తుండటమే పెద్ద సమస్య.  

విజయ్‌ శంకర్‌కు చాన్స్‌!
ధావన్‌కు గాయమయ్యాక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జట్టు కొత్త కూర్పును పరీక్షించాలని భారత్‌ భావించింది. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌ దానికి అవకాశం కల్పించవచ్చు. ఓపెనర్‌గా రోహిత్‌కు తోడుగా రాహుల్‌ బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానంలో విజయ్‌ శంకర్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దాదాపుగా నిర్ణయించుకుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే అతని స్లో మీడియం పేస్‌ ఉపయుక్తంగా ఉంటుందని జట్టు భావిస్తోంది. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే పిచ్‌ను బట్టి అదనపు పేసర్‌ గురించి ఆలోచిస్తామని కోహ్లి చెప్పాడు.

అదే జరిగితే కుల్దీప్‌ స్థానంలో షమీ ఆడే అవకాశం ఉంది. వర్షంతో మ్యాచ్‌ కుదించాల్సి వస్తే అప్పుడు తమ జట్టు కూర్పును కూడా మార్చుకుంటామని కూడా కెప్టెన్‌ అన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో రోహిత్, కోహ్లి వైఫల్యమే భారత్‌ను దెబ్బ తీసింది. ఈసారి వీరిద్దరు గట్టిగా నిలబడితే టీమిండియాకు ఎలాంటి సమస్య ఉండదు. శుభారంభం లభిస్తే ఆ తర్వాత ధోని, పాండ్యా, జాదవ్‌ దానిని కొనసాగించగలరు. ఒక్కసారిగా ఫామ్‌ను అంది పుచ్చుకున్న ఆమిర్‌ను మన టాపార్డర్‌ సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. బుమ్రా, భువనేశ్వర్‌ తమ స్థాయిలో చెలరేగితే భారత్‌కు ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది.  

మాలిక్‌ను ఆడిస్తారా!
భారత్‌తో వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పాక్‌ ఆటగాళ్లలో షోయబ్‌ మాలిక్‌ ఒకడు. అయితే అదంతా గతం. భారత్‌పై గత తొమ్మిదేళ్లలో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ప్రపంచకప్‌లో కూడా ఫామ్‌ ఘోరంగా ఉంది. అయితే అతని అనుభవం దృష్ట్యా మరో అవకాశం ఇవ్వాలని టీమ్‌ భావిస్తోంది. ఆసిఫ్‌ అలీ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌కు చోటు ఇవ్వడం మినహా గత మ్యాచ్‌ ఆడిన జట్టునే పాక్‌ బరిలోకి దించనుంది. పాక్‌కు కూడా టాప్‌–3నే బలం. ఈ ముగ్గురి వన్డే సగటు 50కి పైగానే ఉండటం విశేషం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కూడా ఫఖర్‌ జమాన్‌ సెంచరీనే భారత్‌ను ఓడించింది.ఇమామ్‌ ఉల్‌ హఖ్, బాబర్‌ ఆజమ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అనుభవజ్ఞుడైన హఫీజ్‌ కూడా కీలకం అవుతాడు. కొత్త పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో భారత్‌ ఎప్పుడూ ఆడలేదు. ఇది తమకు అనుకూలిస్తుందని పాక్‌ ఆశిస్తోంది. ఆమిర్‌ను జట్టు ప్రధానంగా నమ్ముకుంది. తన శైలి బౌలింగ్‌కు ఇక్కడి పరిస్థితులు సరిగ్గా అనుకూలించే అవకాశం ఉండటంతో ఆమిర్‌ ప్రమాదరకంగా మారగలడు. మొత్తంగా తొలి మ్యాచ్‌లో విండీస్‌ చేతిలో చిత్తు కావడం మినహా పాక్‌ జట్టు బలంగానే కనిపిస్తోంది. ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ను కూడా ఓడించగలిగిన సర్ఫరాజ్‌ బృందాన్ని తక్కువగా అంచనా వేస్తే కష్టం.  

మీరు హీరోలుగా మారే అవకాశం వచ్చింది. మీది 2019 బ్యాచ్‌. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. ఇందులో ఒక్కో క్షణం మీ కెరీర్‌లను నిర్వచిస్తుంది. ఏదైనా ప్రత్యేకంగా చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతారు.
–పాక్‌ జట్టు సభ్యులనుద్దేశించి కోచ్‌ మికీ ఆర్థర్‌ చెప్పిన మాటలు    

పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్‌ పిచ్‌. కనీస మాత్రం పచ్చిక కూడా లేదు. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా మారిపోయే వాతావరణం జట్టు వ్యూహాలను మార్చవచ్చు. వర్ష ప్రమాదం ఎలాగూ ఉంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు. 1999 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడే మ్యాచ్‌ జరిగింది.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, విజయ్‌ శంకర్, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
పాకిస్తాన్‌: సర్ఫరాజ్‌ (కెప్టెన్‌), ఇమామ్, ఫఖర్, బాబర్‌ ఆజమ్, హఫీజ్, మాలిక్, సొహైల్‌/ఇమాద్, షాదాబ్, రియాజ్, ఆమిర్, షాహిన్‌ ఆఫ్రిది.  


చహల్, రోహిత్, బుమ్రా

>
మరిన్ని వార్తలు