రిటైర్మెంట్‌ ప్రకటించిన విశిష్ట క్రికెటర్‌!

24 May, 2018 19:26 IST|Sakshi
ఇంగ్లండ్‌ జెర్సీలో(ఎడమ), ఐర్లాండ్‌ జెర్సీలో (కుడివైపు)

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ అభిమానులకు దక్షిణాఫ్రికా విధ‍్వంసకర క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ షాకిచ్చిన మరుసటిరోజే మరో క్రికెటర్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ఐర్లాండ్‌ క్రికెటర్‌ ఎడ్ జాయిస్(39) ప్రకటించాడు. అయితే గతంలో ఇంగ్లండ్‌ జాతీయజట్టుకు సైతం ఎడ్‌ జాయిస్‌ ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఈ నెలలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఏకైక మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా కెరీర్‌ కొనసాగిస్తానని ఈ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పష్టం చేశాడు. 

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్లకు రెండు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన జాయిస్‌ ఓవరాల్‌గా 78 వన్డేలు, 18 టీ-20 మ్యాచ్‌లు, టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. 78 వన్డేల్లో 6 శతకాలు, 15 అర్ధ శతకాల సాయంతో 2,622 పరుగులు సాధించాడు. అయితే ఐర్లాండ్‌కు 61 వన్డేలాడిన ఎడ్‌ జాయిస్‌.. 41.36 సగటుతో 2121 పరుగులు చేశాడు. 2016లో అఫ్గానిస్తాన్‌పై చేసిన 160 నాటౌట్‌ వన్డే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2006లో జూన్‌13న ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన జాయిస్‌.. 2006-07 మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 17 వన్డేలాడి 27.70 సగటుతో 471 పరుగులు చేశాడు. 255 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 47 శతకాల సాయంతో 47.95 సగటుతో 18,461 పరుగులు సాధించాడు. కౌంటీల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌, మిడిల్‌సెక్స్‌, సస్సెక్స్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. 

ప్రత్యేకతలు
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాల తరఫున వన్డేల్లో ఆడిన పది మంది క్రికెటర్లలో జాయిస్ ఒకడు. కాగా, రెండు దేశాల తరఫున టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌ ఇతడే. వన్డే ప్రపంచకప్‌లలో రెండు జట్లకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్‌గానూ గుర్తింపు పొందాడు. 2007లో ఇంగ్లండ్‌ నుంచి బరిలోకి దిగిన ఎడ్‌ జాయిస్‌.. 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఐర్లాంట్‌ జట్టుకు ఆడాడు.

రిటైర్మెంట్‌ సందర్భంగా ఎడ్‌ జాయిస్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌ ఆడటం ఆపేసేందుకు ఇది సరైన సమయం. ఇటీవల పాకిస్తాన్‌తో ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌ నా చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. కోచ్‌గా రాణించాలనుంది. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా. ఐర్లాండ్‌ క్రికెటర్లను మేటి జట్టుగా తయారు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నాడు.

మరిన్ని వార్తలు