ధోనీ, డివిలియర్స్లా నిర్దాక్షిణ్యంగా ఆడాలని!

9 Feb, 2017 19:41 IST|Sakshi
ధోనీ, డివిలియర్స్లా నిర్దాక్షిణ్యంగా ఆడాలని!

న్యూఢిల్లీ: ట్వంటీ20 క్రికెట్లో కష్టసాధ్యమైన ట్రిపుల్ సెంచరీని అవలీలగా 72 బంతుల్లోనే బాదేసిన యువ క్రికెటర్ మోహిత్‌ ఆహ్లావత్‌ తన ఆటతీరుకు కారణాలను వెల్లడించాడు. తన బ్యాటింగ్ శైలిని దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ను పోలి ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే తనకు ఏబీ శైలి అంటే ఎంతో ఇష్టమని యువ సంచలనం మోహిత్ అంటున్నాడు. మరో విశేషమేమంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే తనకు ఆదర్శమని మోహిత్ తెలిపాడు. అయితే ఆ మ్యాచ్లో తాను సహజ సిద్ధంగానే ఆడానని, విభిన్న షాట్లను ఎంచుకోలేదన్నాడు.

'చివరి రెండు ఓవర్లలో యాభై పరుగులు చేస్తే.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీ అవుతుందని తెలుసుకున్నాను. 19వ ఓవర్లో 16 స్కోరు చేశాను. డివిలియర్స్, ధోనీ తరహాలో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా చెలరేగితే అరుదైన ఫీట్ సాధ్యమని భావించాను. దీంతో ఆఖరి ఓవర్లో తొలి బంతిని ఫోర్‌, చివరి ఐదు బంతులను సిక్సర్లు బాది మొత్తం 34 పరుగులు కొల్లగొట్టి తొలి 'ట్రిపుల్ వీరుడిగా' నిలిచానని చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ మ్యాచ్లో మావి ఎలెవన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మోహిత్‌ ప్రత్యర్థి జట్టు ఫ్రెండ్స్‌ ఎలెవన్‌పై చెలరేగి ట్వంటీ20 చరిత్రలోనే తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు.

మరిన్ని వార్తలు