ఒకప్పుడు స్టార్‌ క్రికెటర్‌.. ఇప్పుడు దొంగ!

21 Feb, 2020 11:28 IST|Sakshi

సిడ్నీ: సాధారణంగా ఏ క్రికెటరైనా తమ కెరీర్‌లో ఒక్కసారైనా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఆడాలని కోరుకుంటారు. ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే తమ దశే తిరిగి పోతుందని భావిస్తుంటారు. అలాంటిది.. ఒక్కసారి కాదు.. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్‌ ఆడి,  బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో కూడా ప్రాతినిథ్యం వహించిన ఆ క్రికెటర్‌ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ల్యూక్ పోమర్స్ బాచ్ ఇందుకు భిన్నం. అతని ప్రవర్తనతోనే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు టీ20 స్టార్‌ క్రికెటర్‌గా వెలిగి ఇప్పుడు ఏకంగా దొంగగా మారిపోయాడు.

ల్యూక్ పోమర్స్ బాచ్.. ఒకప్పుడు తారాజువ్వలాగా ఎగిసి పడ్డాడు. 2007లో ఆస్ట్రేలియా త‌ర‌పున పోమర్స్‌ బ్యాచ్‌ ఏకైక టీ20లో ప్రాతినిధ్యం వ‌హించాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 ప‌రుగులు చేశాడు. దీంతో త‌ర్వాతి ఏడాది జ‌రిగిన ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో చోటుదక్కించుకున్నాడు.  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కూడా ఆడాడు. ఇలా 2008 నుంచి 2013 వరకూ ఐపీఎల్‌ ఆడుతూనే ఉన్నాడు. 2013లో కింగ్స్‌ పంజాబ్‌ అతన్ని మూడు లక్షల డాలర‍్లకు కొనుగోలు చేసింది. తన ఐపీఎల్‌ చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆడాడు. అతను మొత్తం 17 మ్యాచ్‌ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్‌లో 302 పరుగులు చేశాడు. 2012 ఐపీఎల్లో ఒక అమెరిక‌న్ యువ‌తిని వేదించడంతో అతను అరెస్ట్‌ అయ్యాడు.  2014లో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఆ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. 

చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒక సారి బైకు దొంగ‌త‌నం చేసి, మరోసారి లిక్క‌ర్ షాప్ నుంచి మ‌ద్యం దొంగిలించి అరెస్ట‌య్యాడు. ఈక్ర‌మంలో క‌నీసం ఉండ‌టానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో త‌ల దాచుకున్నాడు. తాజాగా దొంగ‌త‌నంలో మ‌రోసారి ల్యూక్ అరెస్ట‌య్యాడు. బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా ప్రాతినిథ్యం వ‌హించిన ల్యూక్ గురించిన తెలిసిన అభిమానులు మాత్రం విధి ఎంత చిత్రమైనది అని ముక్కున వేలేసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు