రొనాల్డో@700

16 Oct, 2019 02:32 IST|Sakshi

కెరీర్‌లో 700 గోల్స్‌ సాధించిన పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌

ఉక్రెయిన్‌తో ‘యూరో’ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఘనత

కీవ్‌ (ఉక్రెయిన్‌): విఖ్యాత ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌) గొప్ప ఘనత సాధించాడు. తన కెరీర్‌లో 700 గోల్స్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. యూరో–2020 క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం ఉక్రెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72వ నిమిషంలో లభించిన పెనాల్టీని రొనాల్డో లక్ష్యానికి చేర్చి ఈ మైలురాయిని అందుకున్నాడు. వ్యక్తిగతంగా రొనాల్డోకు ఈ మ్యాచ్‌ చిరస్మరణీయమైనా... కెప్టెన్‌గా తుది ఫలితం నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ 2–1తో రొనాల్డో బృందాన్ని ఓడించింది. ఉక్రెయిన్‌ తరఫున యారెమ్‌చుక్‌ (6వ ని.లో), యార్మోలెంకో (27వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ విజయంతో ఉక్రెయిన్‌ 19 పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానం సంపాదించి వచ్చే ఏడాది జూన్‌–జూలైలలో జరిగే యూరో ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

ఇదే గ్రూప్‌లో పోర్చుగల్‌ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రధాన టోరీ్నకి అర్హత సాధిస్తాయి. పోర్చుగల్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు అవకాశాలు సజీవంగా ఉన్నాయి. 2002లో స్పోరి్టంగ్‌ లిస్బన్‌ క్లబ్‌ తరఫున సీనియర్‌ స్థాయిలో కెరీర్‌ మొదలుపెట్టిన 34 ఏళ్ల రొనాల్డో ప్రస్తుతం ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో ఇటలీకి చెందిన యువెంటాస్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2003 నుంచి పోర్చుగల్‌ జాతీయ జట్టు సభ్యుడిగా ఉన్న రొనాల్డో తన దేశం తరఫున 95 గోల్స్‌ చేశాడు. మిగతా అన్ని గోల్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో (దేశం తరఫున) అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇరాన్‌ ప్లేయర్‌ అలీ దాయ్‌ (109 గోల్స్‌) పేరిట ఉంది.  అలీ దాయ్‌ ఆరేళ్ల క్రితమే ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు.

►974ఇప్పటివరకు రొనాల్డో తన 17 ఏళ్ల కెరీర్‌లో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య.  

►6కెరీర్‌లో 700 గోల్స్‌ పూర్తి చేసుకున్న ఆరో ప్లేయర్‌ రొనాల్డో. ఈ జాబితాలో జోసెఫ్‌ బికాన్‌ (చెక్‌ రిపబ్లిక్‌/ఆ్రస్టియా–805 గోల్స్‌), రొమారియో (బ్రెజిల్‌–772 గోల్స్‌), పీలే (బ్రెజిల్‌–767), పుస్కాస్‌ (హంగేరి–746), గెర్డ్‌ ముల్లర్‌ (జర్మనీ–735 గోల్స్‌) ముందున్నారు.

>
మరిన్ని వార్తలు