అది నిజంగా బాధాకరం: కోహ్లి

14 Aug, 2016 16:18 IST|Sakshi

గ్రాస్ ఐలెట్: రియో ఒలింపిక్స్లో భారత్ ఇంకా పతకాల ఖాతా తెరవకపోవడంపై  కొంతమంది చేస్తున్న విమర్శలు ఎంతమాత్రం సరికాదని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఒలింపిక్స్కు వెళ్లిన అథ్లెట్లకు అక్కడ ఉన్నతమైన సౌకర్యాలు లేకపోయినా, వారు ఎటువంటి శక్తివంచనలేకుండా తమ మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నాడు. వెస్టిండీస్తో నాలుగు టెస్టుల సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచాడు.

'ఒలింపిక్స్లాంటి ఒక మెగా ఈవెంట్కు మన అథ్లెట్లు ఎలా సన్నద్ధమయ్యారు అనే కోణంలో మాత్రమే చూడాలి. అక్కడ వారు ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని వదిలిపెట్టండి. తమ తమ స్థాయిలో అత్యున్నత ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తునే ఉన్నారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన అథ్లెట్లపై విమర్శలు రావడం నిజంగా చాలా బాధాకరం.  ప్రతీరోజూ మనది కాదు.  గెలుపు-ఓటములు అనేది క్రీడలో సహజం. క్రికెట్లో కూడా ప్రతీ సిరీస్ను గెలవలేము కదా.  భారత అథ్లెట్లపై విమర్శలు ఆపి, వారికి మద్దతుగా నిలవండి' అని కోహ్లి హితవు తెలిపాడు.

మరిన్ని వార్తలు