చెన్నై సూపర్‌ కింగ్స్‌దే విజయం

6 Apr, 2019 19:50 IST|Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌  22 పరుగుల తేడాతో విజయం సాధించింది.  చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ 138 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(55), సర్పరాజ్‌ ఖాన్‌(67)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. చెన్నై నిర్దేశించిన 161 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో కింగ్స్‌ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. గేల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)లు ఆదిలోనే ఔట్‌ కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాహుల్‌-సర్పరాజ్‌ ఖాన్‌లు ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు.

అయితే చివరి మూడు ఓవర్లలో పంజాబ్‌ విజయానికి 46 పరుగులు కావాల్సిన తరుణంలో రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపించే యత్నం చేశాడు. కాగా, కుగ్లీన్‌ వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ పెవిలియన్‌ చేరడంతో పంజాబ్‌ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. మరొక ఎండ్‌లో సర్ఫరాజ్‌ ఉన్నా ఒత్తిడికి లోను కావడంతో ఆఖరి మూడు ఓవర్లలో 23 పరుగుల మాత్రమే వచ్చాయి. దాంతో పంజాబ్‌కు పరాజయం చవిచూసింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌, కుగ్లీన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌కు వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై 160 పరుగుల చేసింది.  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ తీసుకున్న చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ 56 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత తొలి వికెట్‌గా వాట్సన్‌(26;24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. ఆ తరుణంలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ జోడి 44 పరుగులు జత చేసిన తర్వాత డుప్లెసిస్‌(54; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. ఆ తదుపరి  బంతికి రైనా(17) కూడా ఔట్‌ కావడంతో సీఎస్‌కే 100 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై అంబటి రాయుడు-ఎంఎస్‌ ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. ధోని(37 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అంబటి రాయుడు(21 నాటౌట్‌; 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

>
మరిన్ని వార్తలు