మళ్లీ సీఎస్‌కేదే విజయం

14 Apr, 2019 19:46 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది. ఫలితంగా ఏడో విజయాన్ని కోల్‌కతా ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనే సీఎస్‌కేదే పైచేయి అయ్యింది. తాజా మ్యాచ్‌లో సురేశ్‌ రైనా(58 నాటౌట్‌; 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయగా, రవీంద్ర జడేజా(31 నాటౌట్‌; 17 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఇక చెన్నై జట్టులో డుప్లెసిస్‌(24), కేదార్‌ జాదవ్‌(20)లు ఫర్వాలేదనిపించగా, ఎంఎస్‌ ధోని(16) నిరాశపరిచాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌, పీయూష్‌ చావ్లా తలో రెండు వికెట్లు సాధించగా, గర్నీ వికెట్‌ తీశాడు.

అంతకుముందు కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన  నితీశ్‌ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్‌ ఊతప్ప గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు.

క్రిస్‌ లిన్‌ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్‌(10), దినేశ్‌ కార్తీక్‌(18), శుభ్‌మన్‌ గిల్‌(15)సైతం విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకుని కేకేఆర్‌ను కట్టడి చేశారు.ఇమ్రాన్‌ తాహీర్‌ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్‌కు వికెట్‌ దక్కింది.
 

మరిన్ని వార్తలు