ఇప్పటికీ ఆ స్థానం ధోనిదే..

20 Mar, 2019 17:53 IST|Sakshi

చెన్నై:  చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సారథి ఎంఎస్‌ ధోనిపై ఆ జట్టు ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని జట్టుకు ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని అదే స్థానంలో కొనసాగిస్తామని ఫ్లెమింగ్‌ తెలిపాడు. గత సీజన్‌లో కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మిడిలార్డర్‌ పూర్తి బాధ్యతను ధోని తీసుకున్నాడని పేర్కొన్నాడు. జాదవ్‌ తిరిగి జట్టుతో చేరడంతో నాలుగో స్థానంపై సీఎస్‌కేలో సందిగ్దత నెలకొంది. ఈ తరుణంలో ఫ్లెమింగ్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా నాలుగో స్థానంలో ధోనినే వస్తాడని.. మ్యాచ్‌ పరిస్థితుల దృష్ట్యా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయన్నారు. అంతేకాకుండా జాదవ్‌, ధోనిలు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థులని ఫ్లెమింగ్‌ కితాబిచ్చాడు.
ఇతర జట్లతో పోల్చడం తగదు
బలాబలాల విషయంలో ఓ జట్టును మరో జట్టుతో పోల్చడం తగదని ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సీఎస్‌కే అన్ని విధాల బలంగా ఉందన్నాడు. రైనా, ధోని, డుప్లెసిస్‌, వాట్సన్‌, జాదవ్‌, రాయుడులతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉందన్నాడు. అంతేకాకుండా హర్భజన్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, తాహీర్‌, సాంట్నర్‌లతో స్పిన్‌ విభాగం బలంగా ఉందన్నాడు. డ్వేన్‌ బ్రేవో జట్టుకు అదనపు బలమని పేర్కొన్నాడు. ఇప్పటికే సీఎస్‌కే తన వ్యూహాలను రచించిందని ఫ్లేమింగ్‌ తెలిపాడు. ఇక ఈ నెల 23న ఐపీఎల్‌ సీజన్‌ 12 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కే కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో తలపడనుంది. 
(ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే!)

మరిన్ని వార్తలు