చెన్నై స్పిన్‌ దెబ్బకు ఆర్సీబీ విలవిల

23 Mar, 2019 21:31 IST|Sakshi

చెన్నై: ఈసారి కచ్చితంగా ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలనే భారీ ఆశల నడుమ బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆరంభ మ్యాచ్‌లోనే బ్యాటింగ్‌లో తడబడింది. ఏ దశలోనే ఆకట్టుకోలేక  70 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌(29) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయడంలో విఫలం కావడంతో ఆర్సీబీ మూడంకెల మార్కును చేరలేకపోయింది. విరాట్‌ కోహ్లి(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9) హెట్‌మెయిర్‌(0), శివం దుబే(2), గ్రాండ్‌ హోమ్‌(4)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆర్సీబీ తిరిగి తేరుకోలేకపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్బజన్‌ సింగ్‌ మంచి బ్రేక్‌ ఇచ్చాడు. తొలి మూడు వికెట్లు సాధించి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. అతనికి జతగా ఇమ్రాన్‌ తాహీర్‌ మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. డ్వేన్‌ బ్రేవోకు వికెట్‌ దక్కింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కోహ్లి, పార్థివ్‌ పటేల్‌ ఆరంభించారు. వీరిద్దరూ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే కోహ్లిని హర్భజన్‌ సింగ్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. ఆపై మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌లను ఔట్‌ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అటు తర్వాత తేరుకోలేని ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం స్పిన్నర్లకే ఎనిమిది వికెట్లు సమర్పించుకున్న ఆర్సీబీ 17.1 ఓవర్లలో కుప్పకూలింది. ఓపెనర్‌గా వచ్చిన పార్థివ్‌ చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరడం గమనార్హం.

మరిన్ని వార్తలు