పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో

7 May, 2020 12:40 IST|Sakshi

మా కోచ్‌ పనితీరు భేష్‌

అప్పటికంటే ప్రస్తుత జట్టు సూపర్‌

ఆంటిగ్వా: ప్రస్తుతం తమ క్రికెట్‌ జట్టులో బ్యాటింగ్‌ లోతు అసాధారణమని వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో పేర్కొన్నాడు. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్‌ వనరులు అమోఘమన్నాడు. 2016  టీ20  వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్‌ అని బ్రేవో తెలిపాడు. తమ బ్యాటింగ్‌ లైనప్‌ను చూస్తే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. పదో నంబర్‌ వరకూ కూడా తమ జట్టులో బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లు ఉన్నారన్నాడు. కాగా, గత శ్రీలంక సిరీస్‌లో తమ బ్యాటింగ్‌ లైనప్‌లో సామర్థ్యాన్ని కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ మరింత వెలికి తీశాడన్నాడు. తన పేరును 9వ స్థానంలో పెట్టడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ టీ20 క్రికెట్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తానని అనుకోలేదనే, ఇందుకు కారణం తమ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండటమేనన్నాడు. ఇదే విషయాన్ని తమ కుర్రాళ్లకు సైతం చెప్పానన్నాడు.(‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’)

‘ మా బ్యాటింగ్‌ లైనప్‌ నన్ను  ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి జోక్‌ లేదు. మ్యాచ్‌ ముగిసే రోజు పదో స్థానం వరకూ బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ప్రస్తుత వెస్టిండీస్‌ జట్టు సొంతం. ఒక ఆధిపత్యం చెలాయించే జట్టు మాది. ప్రత్యేకంగా టీ20ల్లో మాకు  తిరుగులేదు. ఇక నుంచి జట్టు బౌలింగ్‌ విభాగంలో కూడా కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా. ప్రధానంగా  డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా ఆకట్టుకోవాలనుకుంటున్నా. గతంలో తాను ఏ రకంగా అయితే బౌలింగ్‌ చేసేవాడినో దాన్ని అందిపుచ్చుకోవాలి’ అని బ్రేవో తెలిపాడు. ఇక తమ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ పొలార్డ్‌లో నిజాయితీని చూశానన్నాడు. ‘పొలార్డ్‌ ఎప్పుడూ గెలవడాన్ని ఆస్వాదిస్తాడు. కెప్టెన్‌గా అది చాలా ముఖ్యం. విజయం సాధించడానికి మిక్కిలి శ్రమిస్తాడు. విజయం సాధించడం కోసం అనే రకాలు మార్గాలను పొలార్డ్‌ ఎంచుకుంటాడు. ఎప్పుడైతే పొలార్డ్‌కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పారో, ఇది నీకు ఒక చాలెంజ్‌ అని చెప్పా. అత్యంత కష్టంతో కూడుకున్న పెద్ద బాధ్యత నీపై ఉందని చెప్పా. జట్టును మరింత ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి, సరైన దిశలో నడిపించడానికి పొలార్డ్‌ సరైన సమయంలో బాధ్యతలు తీసుకున్నాడనే అనుకుంటున్నా. పొలార్డ్‌ చాలా నిజాయితీ పరుడు. సెలక్షన్‌ విషయంలో అతని మార్కు కచ్చితంగా ఉంటుంది. గతంలోని కెప్టెన్లు వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపడు. అతనికి నచ్చిన విధంగానే జట్టు ఉంటుంది’ అని బ్రేవో పేర్కొన్నాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన బ్రేవో.. జనవరిలో ఐర్లాండ్‌తో  జరిగిన మ్యాచ్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.(‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా