విజేత కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ జట్టు

26 May, 2018 10:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శామ్యూల్‌ వసంత్‌ కుమార్‌ స్మారక బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బేగంపేట్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కాలేజి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో కస్టమ్స్‌ జట్టు 78–66తో ఎయిర్‌ బార్న్‌ క్లబ్‌పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 37–32తో ఆధిక్యంలో ఉన్న కస్టమ్స్‌ జట్టు చివరి వరకు అదే జోరును కొనసాగించి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

విజేత జట్టు తరఫున చంద్రహాస్‌ 24 పాయింట్లతో చెలరేగగా, విజయ్‌ కుమార్‌ (13) అతనికి చక్కని సహకారం అందించాడు. ఎయిర్‌బార్న్‌ తరఫున నరేశ్‌ (20), టోని (23) చివరి వరకు పోరాడారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఎయిర్‌బార్న్‌ క్లబ్‌ 65– 64తో సికింద్రాబాద్‌ వైఎంసీఏ జట్టుపై గెలుపొందింది. ఎయిర్‌బార్న్‌ జట్టులో నరేశ్‌ (23), అభిలాష్‌ (13), జాక్‌ (10)... వైఎంసీఏ తరఫున డెన్నిస్‌ సెహగల్‌ (12), ముస్తఫా (14), వరుణ్‌ (14) రాణించారు.

మరో సెమీస్‌లో కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ 90–73తో ఈగల్స్‌ను ఓడించింది. కస్టమ్స్‌ జట్టులో వినయ్‌ యాదవ్‌ (18), విజయ్‌ కుమార్‌ (20), చంద్రహాస్‌ (19)... ఈగల్స్‌ తరఫున అమన్‌ (30), దత్త (15), రోహన్‌ (17) ఆకట్టుకున్నారు. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి టి. శేష్‌ నారాయణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర అకాడమీ చైర్మన్‌ కె. ప్రవీణ్‌ రాజు పాల్గొన్నారు.    

 

మరిన్ని వార్తలు