11ఏళ్ల తర్వాత మెడల్ ఇచ్చారు

3 Sep, 2015 20:13 IST|Sakshi

నిజాయితీకి నిలకడ మీద గుర్తింపు వస్తుందని ఈ ఒలింపియన్ నిరూపించాడు. ఆడిన 11ఏళ్ల తర్వాత  ఆస్ట్రేలియన్ సైక్లిస్ట్ మైఖేల్ రోజర్స్ ఒలింపిక్ కాంస్యపతకం అందుకున్నాడు. 35 ఏళ్ల ఈ సైక్లిస్ట్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సైక్లింగ్ లో పాల్గొన్నాడు. వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంతో రేస్ ముగించాడు.  మూడేళ్ల క్రితం ఈ రేస్ విజేత టేలర్ హామిల్టన్ డోపింగ్ చేసినట్లు ఒప్పుకోవడంతో.. నాలుగో స్థానంలోని  రోజర్స్ కు కాంస్య పతకం దక్కింది.

ఐఓసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రోజర్స్ కు ఒలింపిక్ పతకాన్ని అందించారు. దీనిపై స్పందిస్తూ.. 11 ఏళ్ల తర్వాత ఇలా తన కష్టానికి ఫలితం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇది ఏథెన్స్ క్రీడలు తనకు మిగిల్చిన గొప్ప జ్ఞాపకంగా అభివర్ణించాడు. ఇక డోప్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినా.. ఏథెన్స్ ఒలింపిక్స్ సైక్లింగ్ విజేత అమెరికన్ క్రీడాకారుడు హామిల్టన్ వద్ద ఉన్న పతకాన్ని ఐఓసీ వెనక్కి తీసుకోలేదు.. అప్పట్లో హామిల్టన్ బీ శాంపిల్ ప్రమాదవశాత్తు పాడై పోవడంతో నిషేధానికి గురికాకుండా బయటపడ్డాడు. అయితే.. తర్వాత ఏడాది డోపీగా దొరికి  రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. 2009లో మరోసారి హామిల్టన్ శాంపిల్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఎనిమిదేళ్ల శిక్ష పడింది. అయితే 2011లో మీడియాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో హామిల్టన్.. తాను ఏథెన్స్ ఒలింపిక్స్ సందర్భంలో కూడా  డోపింగ్ చేసినట్లు ఒప్పుకోవడంతో.. ఒలింపిక్స్ కమిటీ హామిల్టన్ నుంచి పతకాన్ని వెనక్కి తీసుకుంది.

మరిన్ని వార్తలు