దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

29 Jul, 2019 01:52 IST|Sakshi

హరియాణా స్టీలర్స్‌పై గెలుపు

యు ముంబాకు షాకిచ్చిన బెంగళూరు బుల్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌  

ముంబై : ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. ఆదివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 41–21 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ రైడర్‌లు చంద్రన్‌ రంజిత్‌ (11 పాయింట్లు), నవీన్‌ కుమార్‌ (10 పాయింట్లు)లు అదరగొట్టారు. వీరికి సయిద్‌ ఘఫారి డిఫెన్స్‌ అండ దొరకడంతో ఢిల్లీకి విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో 22 రైడ్‌ పాయింట్లు, 9 టాకిల్‌ పాయింట్లతో రెండు సార్లు ఆలౌట్‌ చేసిన ఢిల్లీ ముందు 16 రైడ్‌ పాయింట్లు, 4 టాకిల్‌ పాయింట్లతో హరియాణా నిలబడలేకపోయింది. హరియాణా తరపున నవీన్‌ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 

మెరిసిన చంద్రన్‌... 
మ్యాచ్‌ ఆరంభంలో ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు తెచ్చిన చంద్రన్‌ రంజిత్‌ ఢిల్లీకి మంచి ఆరంభాన్నిచ్చాడు. దీనికి సమాధానంగా హరియాణా జట్టు కూడా ఒక రైడ్‌ పాయింట్‌ సాధించి ఖాతా తెరిచింది. స్కోర్‌ 10–9తో ఉండగా ఢిల్లీ సూపర్‌ టాకిల్‌ చేసి రెండు పాయింట్లు సాధించింది.తర్వాత మరో మూడు పాయింట్లను సాధించి 15–10తో ఆధిక్యంలోకి నిలిచింది. విరామం అనంతరం మరింత దూకుడు పెంచిన ఢిల్లీ వరుస రైడ్, టాకిల్‌ పాయింట్లతో ప్రత్యర్థికి అందకుండా దూసుకెళ్లింది. మ్యాచ్‌లో ఢిల్లీ డిఫెండర్‌ ధర్మరాజ్‌ చేరాలథన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో 400 పాయింట్ల మార్కును అందుకోగా... అతని సహచరుడు నవీన్‌ కుమార్‌ తన రైడ్‌లో విక్రమ్‌ కండోరా, కుల్దీప్‌ సింగ్‌లను ఔట్‌ చేయడం ద్వారా లీగ్‌లో 200 పాయింట్లను దాటాడు. 

బుల్స్‌ జోరు.. 
ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన యు ముంబా, బెంగళూరు బుల్స్‌ మ్యాచ్‌లో బుల్స్‌ విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మద్దతు లభించినా చివరి నిమిషాల్లో ఒత్తిడికి లోనైన ముంబై 26–30తో ఓటమి పాలైంది. బెంగళూరు రైడర్‌ పవన్‌ షెరావత్‌ సూపర్‌ ‘టెన్‌’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టును గెలిపించగా...  ముంబా జట్టు కెప్టెన్‌ ఫజేల్‌ అత్రాచలి (3 పాయింట్లు) నిరాశ పరిచాడు. మ్యాచ్‌లో రెండు జట్లు చిత్రంగా ఖాతా తెరిచాయి. ఇరు జట్ల రైడర్లు తమను తామే ఔట్‌ చేసుకుని ప్రత్యర్థి జట్లకు పాయింట్లను సమర్పించుకున్నారు. మొదట రైడ్‌కు వెళ్లిన ముంబా జట్టు రైడర్‌ అభిషేక్‌ సింగ్‌ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్‌ చేసే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి ఎల్లో లాబీని తొక్కాడు. అదే విధంగా బెంగళూరు రైడర్‌ పవన్‌ షెరావత్‌ కూడా ఔటయ్యాడు.  

‘షేర్‌’వత్‌ 
స్కోర్‌ 23–19తో ముంబై ఆధిక్యంలో ఉన్నప్పుడు బుల్స్‌ రైడర్‌ సింహంలా చెలరేగాడు. వరుస రైడ్లలో పాయింట్లను తెచ్చి జట్టు స్కోర్‌ను 23–23తో సమం చేశాడు. అనంతరం ప్రత్యర్థిని కీలక సమయంలో ఆలౌట్‌ చేసిన బుల్స్‌ నాలుగు పాయింట్ల తేడాతో గేమ్‌ను గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో పట్నా పైరేట్స్‌; బెంగాల్‌ వారియర్స్‌తో పుణేరి పల్టన్‌ తలపడతాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా