ఎవరో కొత్త విజేత?

19 Oct, 2019 03:16 IST|Sakshi

దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌ అమీతుమీ

నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7 ఫైనల్‌

రాత్రి గం.7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం   

అహ్మదాబాద్‌: 13 వారాల పాటు 13 నగరాల్లో వందకు పైగా మ్యాచ్‌లతో సాగిన ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ తుది ఘట్టానికి చేరింది. టోర్నీ మొత్తం అదరగొట్టి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌లే తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు జరిగే ఫైనల్‌తో ప్రొ కబడ్డీ లీగ్‌లో సరికొత్త చాంపియన్‌ అవతరించనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సత్తా చాటి తొలిసారి ట్రోఫీని ముద్దాడడానికి రెండు జట్లూ పూర్తిగా సంసిద్ధమయ్యాయి.

నవీన్‌ కుమార్‌ గీ మణీందర్‌ సింగ్‌
ఈ సీజన్‌ మొత్తం రైడింగ్‌లో అదరగొట్టిన రైడర్‌ నవీన్‌ కుమార్‌ ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ వచ్చాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో సూపర్‌ ‘టెన్‌’తో చెలరేగిన అతడు జట్టును పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిపాడు. సెమీస్‌లో కూడా 15 పాయింట్లతో చెలరేగిన అతను జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మరోసారి చెలరేగితే ఢిల్లీ టైటిల్‌ గెలవడం ఖాయం.గాయం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన బెంగాల్‌ కెప్టెన్, స్టార్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ ఫైనల్‌కి సిద్ధమయ్యాడు.

నేడు జరిగే మ్యాచ్‌లో సత్తా చాటి జట్టుకు టైటిల్‌ని అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇక డిఫెన్స్‌లోనూ రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఢిల్లీ తరఫున  రవీందర్‌ పహల్, బెంగాల్‌ తరఫున బల్దేవ్‌ సింగ్‌లు ప్రత్యర్థి రైడర్లను ఒక పట్టు పట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని విభాగాల్లోనూ కాస్త ఆధిక్యంలో ఉన్న ఢిల్లీ జట్టుకు టైటిల్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు