57 సిక్సర్లు.. 27 ఫోర్లు.. 490 !

19 Nov, 2017 11:31 IST|Sakshi

విట్రాండ్ ఓవల్: దక్షిణాఫ్రికా టీనేజ్ క్రికెటర్ డాడ్స్ వెల్ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సెంచరీ, డబుల్, ట్రిపుల్ సెంచరీలను సునాయాసంగా అధిగమించిన డాడ్స్ వెల్.. క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. పాచ్‌ డార్ప్‌ అనే క్లబ్బుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యూయూ జట్టుకు ఆడిన అతను విశ్వరూపం చూపించాడు. 150 బంతుల్లో 57 సిక్సర్లు, 27 ఫోర్లతో 490 పరుగులు నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయిన డాడ్స్ వెల్ దాటికి పాచ్‌ డార్ప్‌ బౌలర్లు చూస్తూ ఉండిపోవడం మినహా చేసేది ఏమీ లేకపోయింది. అతనికి సహచర ఆటగాడు హాస్ బ్రక్ నుంచి చక్కటి సహకారం లభించింది. హాస్ బ్రక్ 54 బంతుల్లో 104 పరుగులు చేశాడు. దాంతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 677 పరుగులు చేసింది. ఈ సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన డాడ్స్‌వెల్‌  పుట్టిన రోజు శనివారం కావడం మరో విశేషం.


ఇన్నింగ్స్‌ మొత్తంలో 63 సిక్సర్లు, 48 ఫోర్లు నమోదయ్యాయి. బౌండరీల ద్వారా మాత్రమే 570 పరుగులు రావడం విశేషం. మూడు వికెట్లకు వరుసగా 194, 204, 220 భాగస్వామ్యాలు నమోదవడం గమనార్హం. ప్రత్యర్థి బౌలర్లలో నలుగురు 100కు పైగా, ఇద్దరు 90కి పైగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం పాచ్‌ డార్ప్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులే చేయడంతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు ఏకంగా 387 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు