'సచిన్‌ డబుల్‌ సెంచరీ చేయడానికి అంపైర్‌ కారణం'

17 May, 2020 14:32 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : భారత దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులు లేవు. క్రికెట్ చరిత్ర‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సచిన్‌ వన్డేల్లోనూ తొలి డబుల్ సెంచరీ సాధించిన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2010లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ ఈ ఫీట్‌ను అందుకొని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచాడు. అయితే ఈ డబుల్ సెంచరీపై సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ అయిన స్టెయిన్ అంపైర్ భయపడటం వల్లనే సచిన్ డబుల్ సెంచరీ సాధించాడని ఆరోపించాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిపిన చిట్ చాట్‌లో స్టెయిన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.(యువీ ఛాలెంజ్‌కు ‘మాస్టర్‌’ స్ట్రోక్‌..)


'గ్వాలియర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడ్డాడు. దాంతో సచిన్ 190 ప్లస్ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీడబ్ల్యూ చేశానని, కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. నాకు ఏమీ అర్థం కాక గౌల్డ్ వైపు చూశానని, అతని ముఖంలో ఏదో భయం కనపడింది. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అంపైర్‌ వైపు చూశా. అంపైరేమో చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే నన్ను ఇక్కడినుంచి బయటకు కూడా వెళ్లనివ్వరనే ఉద్దేశంలో'  పేర్కొన్నాడని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
('ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా')

ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 401 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. తరువాత ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయవద్దని, ముఖ్యంగా బౌలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ' ఒక్క చెత్త బంతిని కూడా సచిన్‌కు వేయకూడదు. ముఖ్యంగా భారత్‌లో అలాంటి తప్పిదం చేయవద్దు. ఆ ఒక్క బంతిని బౌండరీ తరలించే తన ఆటను మొదలు పెడతాడు. దాన్ని అలానే కొనసాగిస్తూ 500 పరుగులైనా చేస్తాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ముగిసిపోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. మనం అతన్ని ఔట్‌ చేయగలమనే ధీమాతోనే బంతులను సంధించాలంటూ ' అండర్సన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు