నీకేంటి.. ఈజీగానే వదిలేస్తావ్‌!

11 Jun, 2020 13:57 IST|Sakshi

న్యూయార్క్‌: తాను యూఎస్‌ ఓపెన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని సంకేతాలిచ్చిన ప్రపంచ పురుషుల సింగిల్స్‌  నంబర్‌ వన్‌ ఆటగాడు, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌పై అమెరికా మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి డానియెల్‌ కొలిన్స్‌ మండిపడ్డారు. తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సిద్ధమవుతున్నానని, యూఎస్‌ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జొకోవిచ్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో కొలిన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జొకోవిచ్‌ తరహాలో 150 మిలియన్‌ డాలర్ల సంపాదన ఉంటే తాము కూడా యూఎస్‌ ఓపెన్‌ను వదిలేసే వాళ్లమని ఎద్దేవా చేశారు. గత ఫ్రిబ్రవరి నుంచి ఎటువంటి టెన్నిస్‌ ఈవెంట్లు లేకపోవడంతో లోయర్‌ ర్యాంక్‌ ఆటగాళ్ల పరిస్థితి దయనీయంగా మారిందన్న కొలిన్స్‌... లోయర్‌ ర్యాంకు ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని స్టార్‌ ఆటగాళ్లు ఆడితే బాగుంటుందన్నారు.

జొకోవిచ్‌ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే లోయర్‌ ర్యాంక్‌ ఆటగాళ్లకు సాయం చేసేవిగా లేవంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. యూఎస్‌ ఓపెన్‌ను అత్యంత రక్షణాత్మక పద్ధతిలో నిర్వహించేటప్పుడు జొకోవిచ్‌ ఇలా వైదొలగుతాననే సంకేతాలు ఇవ్వడం భావ్యం కాదని, ఏదైనా ఒక టోర్నీని సేఫ్‌ జోన్‌లో నిర్వహించడానికి సిద్ధమైనప్పుడు అందుకు స్టార్‌ ఆటగాళ్ల సహకారం అవసరమన్నారు. ఏ టెన్నిస్‌ ఆటగాడైనా  తన మొత్తం కెరీర్‌లో 150 మిలియన్‌ డాలర్లు సంపాదిస్తే దానితో ఏమి చేయాలో చెప్పాలి కానీ, అందుకు బదులుగా యూఎస్‌ ఓపెన్‌ను వదిలేయమనే సంకేతాలిస్తాడా అని చురకలంటించారు. ఆర్థికంగా గాడిలో పడటానికి తమలాంటి టెన్నిస్‌ ఆటగాళ్లకు యూఎస్‌ ఓపెన్‌ ఒక వరమన్నారు.  అయితే ఇష్టం లేని ఆటగాళ్లను బలవంతంగా ఒప్పించి తీసుకురావడం కష్టమని, ఇంకా చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు యూఎస్‌ ఓపెన్‌లో ఆడటానికి సుముఖంగా ఉన్నందున జొకోవిచ్‌ ఆడకపోయినా పెద్దగా వచ్చిన నష్టం ఏమీ ఉండదని కౌంటర్‌ ఇచ్చారు. (ఫ్రెంచ్‌ ఓపెన్‌కే జొకోవిచ్‌ ఓటు)

కాగా, కోవిడ్‌–19 కారణంగా అమెరికాలో నెలకొని ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో  నొవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనడమే మంచిదని అతను భావిస్తున్నాడు. జూన్‌లో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను నిర్వాహకులు కరోనా కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి న్యూయార్క్‌లో జరగాల్సి ఉంది. కాగా, అమెరికాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, క్వారంటైన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉండటంతో యూఎస్‌ ఓపెన్‌ కంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నయమని జొకోవిచ్‌ పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. 

మరిన్ని వార్తలు