నా కెరీర్‌ను నాశనం చేశాడు..

16 May, 2020 16:36 IST|Sakshi

కరాచీ:  తన కెరీర్‌ నాశనం కావడానికి షాహిద్‌ అఫ్రిదినే కారణమని పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా మరోసారి ధ్వజమెత్తాడు. అఫ్రిది కారణంగా తన కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోయిందని విమర్శించాడు. ప్రత్యేకంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డేలు ఎక్కువ ఆడకపోవడానికి అఫ్రిది తనపై ఉన్న చులకన భావనే కారణమన్నాడు. తనతో అఫ్రిది చాలా దారుణంగా వ్యహరించేవాడన్నాడు. ఇది దేశవాళీ క్రికెట్‌ నుంచి జరుగుతూ వస్తుందని, అక్కడ కూడా కెప్టెన్‌ అయిన అఫ్రిది.. తనను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోబెట్టేవాడన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా వన్డేల్లో తనకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడన్నాడు. తాను కేవలం 18 వన్డేలే ఆడటానికి కారణం అఫ్రిదినేనని అన్నాడు. ‘ ఎప్పుడూ మిగతా క్రికెటర్లరు అఫ్రిది సపోర్ట్‌ చేస్తూ ఉండేవాడు. నాకు మాత్రం అఫ్రిది ఎప్పుడూ సహకరించలేదు. నేను పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ బానే ఆడినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.(ధోని.. ఈరోజు నీది కాదు!)

తాను  ప్రపంచ గర్వించే స్థాయిలో ఎదగలేకపోయినా, ఆడినంతలో తృప్తిగానే ఉన్నానని కనేరియా తెలిపాడు. ‘ నన్ను జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కాకుండా అఫ్రిది ఎప్పుడూ అడ్డుకునేవాడు. నేను ఒక లెగ్‌ స్పిన్నర్‌ని. అతను కూడా లెగ్‌ స్పిన్నర్‌ కావడంతో నన్ను తొక్కేయాలని చూసేవాడు. పాకిస్తాన్‌ తరఫున ఒక స్టార్‌ క్రికెటర్‌ కావడంతో నన్ను చులకనగా చూసేవాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా ఫీల్డింగ్‌ను కూడా తొలిగించడానికి కారణంగా చూపేవాడు. అఫ్రిది ఒక సుప్రీమ్‌ ఫిట్‌ లీడర్‌ అయితే నా ఫీల్డింగ్‌ను ఎత్తిచూపాలి. పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎప్పుడూ ఒకరిద్దరు మించి ఫీల్డర్లు ఉండేవారు కాదు. ఫీల్డింగ్‌ పరంగా మేము మెరుగైన జట్టేమీ కాదు. కానీ ఏదొక సాకుతో నన్ను రిజర్వ్‌ బెంచ్‌లో ఉంచేవాడు’ అని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు సాధించాడు. ('ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా')

మరిన్ని వార్తలు