ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ

29 Nov, 2018 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో తన జీవితంలో చీకట్లు అలముకున్నాయని భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్  ట్విట్టర్ వేదికగా ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు. 'నేను చాలా విషాదానికి లోనైయ్యాను. నాకు విలువ లేకుండా జట్టులో నుంచి తీసెయ్యడం చాలా బాధనిపిస్తుంది. జట్టు పట్ల చూపించిన నిబద్ధత, 20ఏళ్ల పాటు దేశం కోసం పడ్డ కృషి అంతా నీరుగారిపోయింది. కఠిన శ్రమ, స్వేదం చిందించి మైదానంలో ఆడిన రోజు, నా బాధ అంతా మట్టి కలిసిపోయాయి.

చివరికి జట్టులో నా పాత్రే అనుమానంగా మారింది. నా ప్రతిభ పట్ల అనుమానాలు మొదలైయ్యయి. ఇన్నేళ్లు ఆడి సాధించినదంతా మరుగున పడిపోయింది. నా జీవితంలో ఇదొక విషాదకరమైన రోజు, దేవుడే నాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మిథాలీని తప్పించారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పొవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు. వారి వల్లే తనకు న్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపారు. ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ.. మిథాలీ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌.. మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనర్‌గా ఆడతానని పట్టుబట్టిందని.. లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పొవార్‌ బోర్డుకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ క‍్రమంలోనే మిథాలీ రాజ్‌  ట్విట్టర్ వేదికగా మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు