ట్రంప్‌కు మద్దతుగా.. ఇరాన్‌కు వ్యతిరేకంగా

7 Jan, 2020 12:02 IST|Sakshi

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కోచ్‌ డారెన్‌ లీమన్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని లీమన్‌ అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌ హీట్‌కు కోచ్‌గా లీమన్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బ్రిస్బేన్‌- సిడ్నీ థండర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా లీమన్‌ బిజీగా ఉండటంతో అతడి ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీమన్‌ ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన ఓ హ్యాకర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా.. ఇరాన్‌, ఖాసీం సులేమానీలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశాడు. అంతేకాకుండా లీమన్‌ ఖాతా పేరును 'Qassem Soleimani| F**k Iran' గా అసభ్యకరంగా మార్చాడు.  దీంతో లీమన్‌ ఫాలోవర్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా కొందరు లీమన్‌పై దుమ్మెత్తిపోశారు.   

అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన లీమన్‌ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాడు. తన ట్విటర్‌ ఆకౌంట్‌కు హ్యాక్‌కు గురైందని బ్రిస్బేన్‌ హీట్‌ అధికారిక ట్విటర్‌ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ అకౌంట్‌ నుంచి వచ్చే మెసేజ్‌లు, పోస్ట్‌లను ఎవ్వరూ నమ్మవద్దని, తనను​ తప్పుగా అపార్థం చేసుకోవద్దని తన ఫోలవర్స్‌కు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పాడు. అయితే తన ట్విటర్‌ హ్యాక్‌ గురవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూశాక కొంతకాలం సోషల్‌ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాస్త విరామం తర్వాత మళ్లీ వసానని, అప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటానన్నాడు. లీమన్‌కు 3,40,000కు పైగా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక లీమన్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. ఆటకు సంబంధించి ఛలోక్తులు విసురుతుంటాడు. 

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా కోచ్‌ పదవికి లీమన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ట్విటర్‌ హ్యాక్‌కు గురైన రెండో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌గా లీమన్‌ చేరాడు. గతేడాది అక్టోబర్‌లో షేన్‌ వాట్సన్‌ అకౌంట్‌ కూడా హ్యాక్‌కు గురైంది. వాట్సన్‌ ట్విటర్‌ ఆకౌంట్‌ను హ్యాక్‌ చేసిన హ్యాకర్‌ అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్ట్‌ చేశాడు. దీంతో అభిమానులతో పాటు, వాట్సన్‌ కూడా షాక్‌కు గురయ్యాడు. అయితే తన వలన జరిగిన అసౌకర్యానికి వాట్సన్‌ అభిమానులకు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. 

అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌ జనరల్‌  ఖాసీం సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్‌ను తమ సైన్యమే పేల్చేసిందని, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది. అమెరికాపై ప్రతిదాడి తప్పదని ఇరాన్.. గట్టిగానే హెచ్చరించింది. అయితే, ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. 

>
మరిన్ని వార్తలు