రోహిత్‌ వెనక్కి  పిలిచి ఉంటే... 

9 Feb, 2019 03:54 IST|Sakshi

రెండో టి20 మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన అంపైర్‌ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్‌) పనితీరుపై కొత్త సందేహాలు రేకెత్తించింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో కృనాల్‌ వేసిన బంతి బ్యాట్స్‌మన్‌ డరైన్‌ మిషెల్‌ ప్యాడ్‌లను తాకింది. దాంతో భారత్‌ అప్పీల్‌ చేయడం, వెంటనే అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. అయితే నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ విలియమ్సన్‌ సూచనపై మిషెల్‌ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను దాటే సమయంలో ఎలాంటి ‘స్పైక్‌’ను చూపించలేదు. పైగా హాట్‌స్పాట్‌ లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది.

అయితే బాల్‌ ట్రాకింగ్‌లో మాత్రం మూడు ఎరుపు గుర్తులు రావడంతో మూడో అంపైర్‌ షాన్‌ హెయిగ్‌... ఔట్‌గా ప్రకటించారు. మైదానంలో భారీ స్క్రీన్‌పై ఇదంతా చూసిన కివీస్‌ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. విలియమ్సన్‌ అంపైర్ల వద్దకు వెళ్లి ఏమిటిలా అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేయగా, ఆ తర్వాత రోహిత్‌ కూడా బ్యాట్స్‌మెన్‌తో పాటు అంపైర్లతో  చర్చించాడు. బహుశా అతనికి సైతం అంపైర్‌ నిర్ణయం తప్పని అర్థమై ఉంటుంది.

అయితే అంపైర్లతో రోహిత్‌ మరోసారి మాట్లాడుతుండగా అతడిని ధోని వారించడం కనిపించింది. దాంతో మిషెల్‌ వెనుదిరగక తప్పలేదు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి కెప్టెన్‌ మాత్రమే ఔటైన బ్యాట్స్‌మన్‌ను తర్వాతి బంతి వేసేలోగా వెనక్కి పిలవవచ్చు. కానీ రోహిత్‌ ఆ పని చేయలేదు. క్రీడాస్ఫూర్తి వంటి అంశాలకంటే అతను వికెట్‌ విలువను ఎక్కువగా భావించినట్లున్నాడు! మ్యాచ్‌ అనంతరం ఈ ఘటనపై భారత పేసర్‌ ఖలీల్‌ మాట్లాడుతూ...‘అప్పీల్‌ను వెనక్కి తీసుకోమని విలియమ్సన్‌ మమ్మల్నేమీ కోరలేదు. మేం అంపైర్‌ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నాం. దానిని అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఆ సమయంలో జరిగిన చర్చను వివరించాడు. 

మరిన్ని వార్తలు