వార్నర్‌ బుట్టబొమ్మ స్టెప్పేశాడు

1 May, 2020 04:16 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సహజంగా మైదానంలో వీరబాదుడు బాదుతుంటే గ్యాలరీలో ప్రేక్షకులు చిందులేస్తారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ అయిన వార్నర్‌ సిక్సర్లకు ఉప్పల్‌ స్టేడియం ఇలా ఎన్నోసార్లు హోరెత్తింది. ఇప్పుడు అదే వార్నర్‌ స్టెప్పులేస్తే వైరల్‌ కాకుండా ఉంటుందా చెప్పండి. అది కూడా స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాటకి బ్యాట్స్‌మన్‌ డాన్స్‌ చేస్తే లైక్‌ల మీద లైక్‌లు వచ్చిపడవా! ‘అల వైకుంఠపురంలో’ చిత్రం ఈ ఏడాది హిట్‌ అయ్యింది. ‘సామజవరగమన’ పాట నెట్టింట ఓ ఊపు ఊపేసింది.

అలాగే మరో పాట ‘బుట్టబొమ్మ... బుట్టబొమ్మ...’ ఇది కూడా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ తెగ ఆకట్టుకుంది. అందుకేనేమో కంగారూ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌కూ ఇదే నచ్చింది. ఇంకెం!! తన భార్య క్యాండీస్‌తో కలిసి ఆ చిత్రగీతంలోని స్టెప్పుల్ని అనుకరిస్తూ డాన్స్‌ చేశాడు. వీడియోలో వార్నర్, క్యాండీస్‌ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది. అందుకే ఆ పాటలాగే వీరి డాన్స్‌ అదిరిపోయింది. సన్‌రైజర్స్‌ జెర్సీ వేసుకొని చిందులేసిన వార్నర్‌ పాట బాగుందని బన్నీ (అర్జున్‌)ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేయగా... హీరో థ్యాంక్యూ చెప్పారు. ఇక సామాజిక మీడియాలో... పైగా ఈ లాక్‌డౌన్‌ సీజన్‌లో ఎవరు మాత్రం ఈ వీడియో చూడకుండా ఉంటారు! లైక్‌ కొట్టకుండా ఎవరుంటారు!! అందుకే ఆ పాట... వార్నర్‌ దంపతుల సయ్యాట తెగ వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు