టిమ్‌ సౌథీపై వార్నర్‌ ఆగ్రహం

14 Dec, 2019 16:03 IST|Sakshi

ఇదేనా క్రీడా స్ఫూర్తి.. ఇదేనా హుందాతనం

పెర్త్‌: మైదానంలో క్రికెటర్లు కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించడం సర్వ సాధారణం. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ రెచ్చగొట్టే యత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా బ్యాట్స్‌మన్‌-బౌలర్‌ పోరు కూడా తరచు కనిపిస్తూ ఉంటుంది. వీరు ఒకర‍్ని ఒకరు స్లెడ్జింగ్‌ చేసుకోవడం ఒకటైతే, అసహనంతో బంతిని బ్యాట్స్‌మన్‌పైకి విసిరేసే సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇలా సహనం కోల్పోయిన తర్వాత సదరు బౌలర్‌.. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సారీ చెప్పడం కామన్‌. కాకపోతే ఆస్ట్రేలియాతో పెర్త్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ చేసిన పనిలో క్రీడా స్ఫూర్తి లోపించినట్లు కనిపించింది. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను బంతితో కొట్టినా దానికి ఎటువంటి క్షమాపణ కోరకపోవడం ఫీల్డ్‌లో ఉన్న క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. అది అనవరసపు త్రో అనే విషయం అభిమానులకు కనిపిస్తున్నా సౌథీ చేసి యాక్షన్‌ ఇంకా విసుగు తెప్పించింది.

గురువారం ఆరంభమైన తొలి టెస్టు  మొదటి రోజు ఆటలో ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇది కనిపించింది.  ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ను అందుకున్న సౌథీ... ఆసీస్‌ ఓపెనర్‌  జో బర్న్స్‌కు ఒక బంతిని వేశాడు. ఆ బంతిని బర్న్స్‌ డిఫెన్స్‌ ఆడగా అది కాస్తా బౌలర్‌ సౌథీ వద్దకు వెళ్లింది. ఆ బంతిని అందుకున్న వెంటనే సౌథీ నేరుగా బ్యాట్స్‌మన్‌ వైపు విసిరేశాడు. ఆ సమయంలో క్రీజ్‌ దాటి కాస్త బయట ఉన్న బర్న్స్‌ కు ఆ బంతి బలంగా తాకింది. అయితే దీనిపై ఎటువంటి రియాక్షన్‌ లేని సౌతీ నవ్వుకుండా వెనక్కి వచ్చేశాడు.  ఇది నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న మరో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కోపం తెప్పించింది. దాంతో సౌథీతో వాదనకు దిగక తప్పలేదు.(ఇక్కడ చదవండి: మొన్న స్మిత్‌.. నేడు వార్నర్‌)

ఇదేనా క్రీడాస్ఫూర్తి.. ఇదేనా హుందాతనం, అది అనవసరమైన త్రో కదా అంటూ వార్నర్‌ సీరియస్‌ అయ్యాడు. దానికి సౌథీ నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. అతను క్రీజ్‌ బయట ఉన్నాడు కాబట్టి బంతిని విసిరా అంటూ సమాధానమిచ్చాడు. ఆ బంతి బర్న్స్‌ చేతికి తగిలింది తెలుసా అంటూ వార్నర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ‘మంచిది’ అంటూ సౌథీ నుంచి వ్యంగ్యంగా సమాధానం వచ్చింది. ఇది వార్నర్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.  ఆ విషయం చెప్పనక్కర్లేదు.. కాస్త హుందాగా ఉండటం నేర్చుకో అంటూ వార్నర్‌ రిప్లై ఇచ్చాడు.  ఇలా వారి మధ్య మాటల యుద్ధం పెద్దది కావొస్తుండటంతో అంపైర్లు, కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 166 పరుగులకు ఆలౌట్‌ కాగా, అంతకుముందు ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు