మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్‌

30 Apr, 2020 14:44 IST|Sakshi

బంతిని సలైవాతో షైన్‌ చేయడం ఇప్పటిది కాదు

కొత్త పద్ధతి అవసరం లేదు

సిడ్నీ:  అంతర్జాతీయ క్రికెట్‌లో బంతికి లాలాజలాన్ని(సలైవా) రుద్దడాన్ని రద్దు చేయాలనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వ్యతిరేకించాడు. ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మార్పుతో ఆటగాళ్లకు తక్కువ రిస్క్‌ లేదా, అసలు రిస్కే ఉండదు అనుకోవడం పొరపాటన్నాడు. బంతిని షైన్‌ చేయడం కోసం లాలాజలాన్ని రుద్దడం వందల ఏళ్ల నుంచి వస్తున్నదన్నాడు. ఇలా చేయడం వల్ల పూర్తిగా వైరస్‌ను నియంత్రించవచ్చనే విషయాన్ని మనం చెప్పలేమన్నాడు. ఈ విధానాన్ని పూర్తిగా తొలగించి కొత్త మార్పును తీసుకొస్తారని తాను అనుకోవడం లేదని వార్నర్‌ తెలిపాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బంతికి లాలాజలం రుద్దడాన్ని నిలిపివేయాలనే ఐసీసీ చూస్తోంది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో బంతిని షైన్‌ చేయడం కోసం కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ వకార్‌ యూనిస్‌, ఆశిష్‌ నెహ్రాలు, హర్భజన్‌ సింగ్‌లు సలైవా మార్పు వద్దన్నారు. దీనిని యథావిధిగా కొనసాగించాలని సూచించారు. మరికొంతమంది మాత్రం సలైవాను బంతిపై రుద్దడాన్ని ఆపాలని కోరుతున్నారు. (అది షేన్‌ వార్న్‌కే సాధ్యం: యూసఫ్)

టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్‌ చితక్కొడతారు. తమ కెరీర్‌ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్‌ ఉదంతంలో స్యాండ్‌ పేపర్‌ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్‌లీన్, ప్యాంట్‌ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. (ఖవాజా, షాన్‌ మార్ష్‌లను తప్పించారు..!)

మరిన్ని వార్తలు