కోహ్లి కాల్‌ కోసం ఎదురుచూస్తున్నా: వార్నర్‌

15 Jan, 2020 16:41 IST|Sakshi

భారత్‌లో క్రికెట్‌​ ఆడటం తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. టీమిండియాతో మ్యాచ్‌ అంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను మట్టికరిపించారు. అయితే ఈ మ్యాచ్‌ కంటే ముందు డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ టీంతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మాట్లాడుతూ.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా తనకు ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మర్చిపోలేనిదని హర్షం వ్యక్తం చేశాడు. (కలవరపాటుకు గురైన డేవిడ్‌ వార్నర్‌..! )

అదే విధంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫోన్‌ కాల్‌ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ‘ విరాట్‌ నన్ను డిన్నర్‌కు పిలుస్తాడని వేచి చూస్తున్నాను. ఇదిగో నా ఫోన్‌ అతడి కాల్‌ కోసం ఎదురుచూస్తోంది’ అని వార్నర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని... విరాట్‌, రాహుల్‌, రోహిత్‌ వంటి ఆటగాళ్లతో జట్టు పరిపూర్ణంగా ఉందని.. బుమ్రా జట్టులోకి రావడం కూడా టీమిండియాకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్‌లో వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ సీజన్‌ 12లో తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ కోసం సన్నద్ధం కావడానికి... ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలోనే వార్నర్‌ స్వదేశానికి పయనం కావడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, కేఎల్‌ రాహుల్‌ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 37.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 258 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. ఇక 112 బంతులు ఎదుర్కొని 128 పరుగులు చేసి(నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగనుంది.  

పది వికెట్ల పరాభవం.. ఆసీస్‌ ఏకపక్ష విజయం

మరిన్ని వార్తలు