వార్నర్‌ విశ్వరూపం

1 May, 2017 00:54 IST|Sakshi
వార్నర్‌ విశ్వరూపం

మెరుపు సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌
►  హైదరాబాద్‌కు మరో విజయం
►  48 పరుగులతో చిత్తుగా ఓడిన కోల్‌కతా
రాణించిన సిరాజ్, కౌల్, భువనేశ్వర్‌   


డేవిడ్‌ వార్నర్‌ బ్యాట్‌ మరోసారి గర్జించింది. పవర్‌ షాట్‌లు, రివర్స్‌ స్వీప్‌లు, పుల్‌ షాట్‌లు, పంచింగ్‌ డ్రైవ్‌లు... ఒకటేమిటి ఇలా ప్రతీ అస్త్రాన్ని వాడుతూ అతను వీర విధ్వంసమే సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే శతకం బాది తన సత్తా ప్రదర్శించడంతో సన్‌రైజర్స్‌కు మరో భారీ విజయం దక్కింది. వార్నర్‌ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సునాయాసంగా తలవంచింది. భారీ స్కోరును ఛేదించలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చతికిల పడ్డారు.  

హైదరాబాద్‌: సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ మరోసారి రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తు చేసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 48 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మైదానంలో ‘సన్‌’ జట్టుకిది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (59 బంతుల్లో 126; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఇది ఐదో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాబిన్‌ ఉతప్ప (28 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్‌   పాండే (29 బంతుల్లో 39; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడారు. వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఆ 43 బంతులు...
అద్భుత బ్యాటింగ్‌తో సీజన్‌ ఆరంభం నుంచి రైజర్స్‌ను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్‌ వార్నర్‌ ఈసారి మరింతగా రెచ్చిపోయాడు. ఒక్క బౌలర్‌ను కూడా వదిలి పెట్టకుండా విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అన్ని వైపులా అతను బాదిన సిక్సర్లు ఆకాశంలో తారాజువ్వల్లా దూసుకుపోయాయి. ఎదుర్కొన్న నాలుగో బంతిని ఫోర్‌ కొట్టిన వార్నర్‌ ఆ తర్వాత ఆగలేదు. కొన్ని సార్లు అతడికి అదృష్టం కూడా కలిసొచ్చింది. 13 పరుగుల వద్ద మిడాన్‌లో వోక్స్‌కు క్యాచ్‌ పట్టే అవకాశం వచ్చినా... తప్పుడు అంచనాతో అతను ఆ అవకాశం చేజార్చాడు. వోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన వార్నర్, పఠాన్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టాడు.

మరో సిక్స్‌తో 25 బంతుల్లోనే అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. కుల్దీప్‌ వేసిన మరో ఓవర్లో రైజర్స్‌ కెప్టెన్‌ పండగ చేసుకుంటూ వరుసగా 4, 6, 6 పరుగులు రాబట్టాడు. 86 పరుగుల వద్ద అతను ఇచ్చిన మరో సునాయాస క్యాచ్‌ను వోక్స్‌ వదిలేశాడు.ఉమేశ్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా రెండు పరుగులు చేసి సెంచరీ మార్క్‌ను అందుకున్న వార్నర్, నరైన్‌ బౌలింగ్‌లో మూడు వరుస బౌండరీలతో జోరు కొనసాగించాడు. వార్నర్‌ ఆరుగురు కోల్‌కతా బౌలర్ల బౌలింగ్‌లో కనీసం ఒక సిక్సర్‌ అయినా కొట్టడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది.

విలియమ్సన్‌ కూడా...
మరో ఎండ్‌లో ఎక్కువగా బంతులు ఆడే అవకాశం రాని శిఖర్‌ ధావన్‌ (30 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వార్నర్‌కు తగిన సహకారం అందించాడు. 13 పరుగుల వద్ద అతడిని స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని ఉతప్ప చేజార్చాడు. చివర్లో  మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన విలియమ్సన్,  వోక్స్‌ ఓవర్లో మూడు బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా స్కోరు 200 పరుగులు దాటింది.   
ఉతప్ప మినహా...: భారీ ఛేదన చేసే క్రమంలో గంభీర్‌ (11) తొలి ఓవర్లో రెండు ఫోర్లతో శుభారంభం చేశాడు. అయితే రెండో ఓవర్లో సిరాజ్‌ 144 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని ఆడలేక నరైన్‌ (1) వెనుదిరిగాడు. కౌల్‌ కూడా తన ఓవర్లోనే గంభీర్‌ను అవుట్‌ చేయడంతో కోల్‌కతా కష్టాలు పెరిగాయి. ఈ దశలో ఉతప్ప, పాండే కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

దూకుడుగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 51 బంతుల్లో 78 పరుగులు జోడించారు. ఉతప్ప కొన్ని భారీ షాట్లతో అలరించాడు. అయితే భువీ చక్కటి బంతితో పాండేను అవుట్‌ చేసి ఈ జోడీని విడదీయగా, సిరాజ్‌ వేసిన బంతికి ఉతప్ప వెనుదిరిగాడు. ఉతప్ప అవుటయ్యే సమయానికి విజయానికి 45 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన కోల్‌కతా ఆ తర్వాత చేతులెత్తేసింది.

వర్షం వచ్చినా...: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు ముగిసిన తర్వాత వచ్చిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే వానతో 46 నిమిషాల సమయం నష్టపోయినా... మొత్తం ఓవర్లలో ఎలాంటి కోత పడలేదు.

మరిన్ని వార్తలు