ఆసీస్ అదే జోరు

16 Dec, 2013 00:55 IST|Sakshi
ఆసీస్ అదే జోరు

పెర్త్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 112; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. వాట్సన్ (29), స్మిత్ (5) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (54), వార్నర్‌లు తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించారు. రెండుసార్లు స్టంపౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ వార్నర్ కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. క్లార్క్ (23) విఫలమయ్యాడు. బ్రెస్నన్, స్టోక్స్, స్వాన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 369 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు 180/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూల పేస్ ధాటికి కుక్‌సేన మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ (15), స్టోక్స్ (18), బ్రెస్నన్ (21), స్వాన్ (19 నాటౌట్) పోరాడి విఫలమయ్యారు. 61 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. హారిస్, సిడిల్ చెరో మూడు వికెట్లు తీయగా, జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి.
 
 బ్రాడ్‌కు గాయం!
 ఇప్పటికే యాషెస్‌లో తడబడుతున్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో పెవిలియన్‌కు పరిమితమయ్యాడు. మూడో రోజు ఆటలో జాన్సన్ వేసిన పదునైన యార్కర్... బ్రాడ్ కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్‌కు దిగలేదు. ఇన్నింగ్స్ విరామంలో కాసేపు నెట్స్‌లో గడిపిన బ్రాడ్‌కు స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చాక సోమవారం అతనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు