వార్నర్ 156... కివీస్ 147

12 Dec, 2016 14:30 IST|Sakshi
వార్నర్ 156... కివీస్ 147
మూడో వన్డేలోనూ ఆసీస్ గెలుపు 
  న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్ సొంతం 
 
 మెల్‌బోర్న్: ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా రెండో శతకం (128 బంతుల్లో 156; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదడంతో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు ఈ ఏడాది ఇది ఏడో సెంచరీ. దీంతో గంగూలీతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఒక ఏడాదిలో అత్యధిక శతకాలు (9) చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు. ఇక వార్నర్‌కు తోడు పేసర్ మిచెల్ స్టార్క్ (3/34) బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 117 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో గత పదేళ్లలో చాపెల్-హ్యాడ్లీ సిరీస్‌ను ఆసీస్ తొలిసారిగా క్లీన్ స్వీప్ చేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. 
 
 ఆసీస్ ఇన్నింగ్‌‌సలో జట్టు స్కోరులో సగం కన్నా ఎక్కువ పరుగులు చేసిన వార్నర్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకు అంతా తానై విజృంభించాడు. ఓ దశలో బౌల్ట్ ధాటికి ఆస్ట్రేలియా 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో ట్రావిస్ హెడ్ (70 బంతుల్లో 37; 2 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు వార్నర్ 105 పరుగులు జత చేశాడు. 95 బంతుల్లో శతకాన్ని సాధించిన వార్నర్ జట్టు ఇన్నింగ్‌‌స చివరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా తనకిది వన్డేల్లో 11వ సెంచరీ. ఆ తర్వాత లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 36.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గప్టిల్ (40 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. 44 పరుగుల వద్ద ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. కమ్మిన్‌‌స, ఫాల్క్‌నర్, హెడ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘సిరీస్’ పురస్కారం కూడా వార్నర్‌కే దక్కింది. 
మరిన్ని వార్తలు