ఇక ఐపీఎల్లో ఆసీస్ క్రికెటర్లు ఆడరా?

11 May, 2017 18:44 IST|Sakshi
ఇక ఐపీఎల్లో ఆసీస్ క్రికెటర్లు ఆడరా?

సిడ్నీ:గత పదేళ్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఈ లీగ్ కు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ క్రికెటర్లకు పలురకాలైన జాతీయ కాంట్రాక్ట్లు అప్పజెప్పి వారిని ఐపీఎల్ కు దూరం చేయాలనేది ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) ఆలోచనగా ఉంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు దూరంగా ఉండటం ఆ క్రికెట్ బోర్డుకు రుచించడంలేదు. దానిలోభాగంగా కొత్త కాంట్రాక్ట్లు, వివిధ రకాల సుదీర్ఘ కాంట్రాక్ట్లు పేరుతో వారిని ఐపీఎల్ కు దూరం చేయాలని యోచిస్తోంది.

ప్రధానంగా ఆటగాళ్లు తరచు గాయాల బారిన పడటం కూడా సీఏకు మింగుడు పడటం లేదు. దాంతో ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లకు మూడేళ్ల సుదీర్ఘ కాంట్రాక్ట్ను అప్పచెప్పాలని చూస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆసీస్ క్రికెటర్లు ఆయా కాంట్రాక్ట్లతో బిజీగా ఉండటమే కాదు.. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా కాస్త ఎక్కువగానే లబ్ది పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్ను కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంచితే, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొంతమంది ఆసీస్ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇదే కేవలం సీఏ పాలక వర్గానికి మాత్రమే లబ్ది చేకూర్చేదిగా ఉందని, ఇందుకు తాము సమ్మతంగా లేమంటూ ఇప్పటికే బోర్డుకు పలువురు క్రికెటర్లు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు