'మర ఫిరంగి' మారిపోయాడు..!

1 Jun, 2016 00:39 IST|Sakshi
'మర ఫిరంగి' మారిపోయాడు..!

మైదానంలో డేవిడ్ వార్నర్ బ్యాట్ మాట్లాడుతుంది...లేదంటే అతని నోరు ఆగకుండా మాట్లాడుతుంది... ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ గురించి అందరూ చెప్పే మాట ఇది. ఆటతో అద్భుతాలు చేసినా, నోటి దురుసుతో వివాదాలను వెంట మోసుకుపోవడంలో కూడా ‘రికార్డులు’ కొల్లగొట్టిన ఘనత వార్నర్‌ది. మూడేళ్ల క్రితం మందు తాగిన మత్తులో తోటి క్రికెటర్‌పై ముష్టిఘాతాలు కురిపించినవాడు ఇప్పుడు మంచి బాలుడిలా మారిపోయాడు! ఈ సారి ఐపీఎల్‌లో అతని బ్యాట్ మాత్రమే మాట్లాడింది.

ఎక్కడా వార్నర్ నోటికి పని చెప్పలేదు. వివాదం అనే మాటను బౌండరీ బయటికి విసిరి కొట్టి కేవలం తన వ్యూహాలతోనే జట్టును చాంపియన్‌ను చేశాడు. ఆస్ట్రేలియా టి20 జట్టుకు అతడిని కెప్టెన్‌ను చేయాలంటూ చాపెల్‌లాంటివాళ్లే ఇప్పుడు చెప్పడం వార్నర్ తనదైన శైలిలో చేసిన పెద్ద జంపింగ్!
 
డేవిడ్ వార్నర్ ప్రస్థానం ఆసక్తికరం
కెరీర్‌లో వివాదాలతో సహవాసం
ఐపీఎల్‌లో అనూహ్య మార్పు
విజయవంతమైన కెప్టెన్‌గా కొత్త రూపు

సాక్షి క్రీడా విభాగం: మర ఫిరంగి... డేవిడ్ వార్నర్ ముద్దుపేరు ఇది. మందుగుండు దట్టించి మండించిన తర్వాత ఫిరంగి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తోందో డేవిడ్ వార్నర్ కెరీర్ కూడా అంతే స్థాయిలో దూసుకుపోయింది. ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండా ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్ ఆ తర్వాత మూడు ఫార్మాట్‌లలోనూ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. టి20 ప్రదర్శనతో టెస్టుల వరకు ఎదిగిన తొలి ఆసీస్ ఆటగాడు కూడా అయిన వార్నర్... ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలోనే దూకుడుగా ఆడటం అలవాటుగా మార్చుకున్నాడు. వార్నర్ తొలి టెస్టు మ్యాచ్ టెస్టుల చరిత్రలో 2020ది కావడం యాదృచ్ఛికం!
 
రెండు వైపులా పదును

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రివర్స్ స్వీప్, స్విచ్ హిట్‌లను చాలా కాలం క్రితమే తరచుగా వాడి పాపులర్ చేసిన ఆటగాళ్లలో వార్నర్ కూడా ఒకడు. చిన్నప్పటినుంచి లెఫ్ట్ హ్యాండర్ అయిన వార్నర్ 13 ఏళ్ల వయసులో కోచ్ సూచనపై ఏడాది పాటు రైట్ హ్యాండర్‌గా మారి ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో అతను పదే పదే బంతిని గాల్లోకి కొడుతుండటంతో ఈ మార్పు జరిగింది. ఏడాది పాటు ఇలాగే ఆడిన అతను మళ్లీ తల్లి సలహాతో తన పాత శైలికి వచ్చి.... అండర్-16 జాతీయ స్థాయిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు.

నెట్స్‌లో కూడా రెగ్యులర్‌గా ఈ షాట్‌లను ఆడే వార్నర్ ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్కసారైనా స్విచ్‌తో పరుగులు రాబట్టడాన్ని ఇష్టపడతాడు. 2009లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో వార్నర్ తన బ్యాట్‌తో కొత్త సంచలనానికి తెర తీశాడు. రెండు వైపులనుంచి షాట్లు ఆడగలిగే కొత్త తరహా బ్యాట్‌ను టి20ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి బరిలోకి దిగాడు. ఇది స్విచ్ హిట్‌లకు అద్భుతంగా పని చేసినా... విమర్శలు రావడంతో తర్వాత దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది.
 
మళ్లీ మళ్లీ తప్పులు

‘సీరియస్ క్రికెట్‌లో ఇలా చిల్లర చేష్టలతో ఏ మాత్రం బుర్ర ఎదగకుండా నేను చూసిన క్రికెటర్ వార్నర్. ఇలాంటి వాళ్ల కోసమే క్రికెట్‌లో కూడా ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు పెట్టాలేమో’... న్యూజిలాండ్ దిగ్గజం మార్టిన్ క్రో చేసిన వ్యాఖ్య ఇది. ఒకటా, రెండా.... డేవిడ్ పదే పదే చేసిన పనులు అతడిని విలన్‌గా మార్చేశాయి. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ గ్రీవ్స్‌తో మాటల యుద్ధం మొదలు ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌లను దూషించినందుకు భారీ జరిమానా, మైదానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ సోలెకైల్‌తో గొడవ, గుర్రాల రేసు చూసేందుకు తన సొంత క్లబ్ మ్యాచ్ ఆడకుండా డుమ్మా, దక్షిణాఫ్రికా ట్యాంపరింగ్ చేసిందంటూ నోరు జారడం, భారత్ సిరీస్‌తో రోహిత్ శర్మ, ఆరోన్‌లతో నోటి దురుసు... ఈ పేద్ద జాబితాతో ఒక దశలో ఆస్ట్రేలియా బోర్డు ఇలాగైతే నీ పని ఖతం అంటూ బహిరంగంగా హెచ్చరించాల్సి వచ్చింది.

వార్నర్ కెరీర్‌లో ఇలాంటి వివాదానికి పెద్దన్నలాంటి ఘటన 2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఓడిన అనంతరం పబ్‌లో జో రూట్ మొహంపై పిడిగుద్దులు విసరడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీని తర్వాత అతను ఎంతో కాలం క్రికెట్‌లో సాగడనిపించింది. కానీ పడిలేచిన కెరటంలా వార్నర్ మళ్లీ నిలబడ్డాడు.
 
ఐపీఎల్‌లో కొత్త హీరో
పొట్టివాడైనా గట్టివాడైన వార్నర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు ఐపీఎల్‌ను వేదికగా చేసుకున్నాడు. ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున చెప్పుకోదగ్గ పరుగులు సాధించినా అతనికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2009లో హైదరాబాద్ వేదికగా న్యూసౌత్‌వేల్స్ చాంపియన్స్ లీగ్ గెలుచుకున్న సమయంలో అతను అనామకుడే. కానీ గత మూడేళ్లలో అతను ఒక్కసారిగా ఈ లీగ్‌లో ప్రధానాకర్షణగా మారాడు.

గత ఏడాది అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతను 2014 సీజన్‌లో కూడా 500కు పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 17 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 848 పరుగులతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారం మొత్తం తనే మోశాడు. 9 అర్ధ సెంచరీలు సహా 151.42 స్ట్రైక్‌రేట్‌తో అతను చేసిన పరుగులు జట్టును చాంపియన్‌గా నిలిపాయి. ఐపీఎల్ కెరీర్‌లో 100వ మ్యాచ్ అయిన ఫైనల్‌ను వార్నర్ విజయంతో చిరస్మరణీయం చేసుకున్నాడు.
 
కెప్టెన్ కూల్...
ఫైనల్ గెలిచిన తర్వాత ‘ఇప్పుడు ఒక బీరు తాగాలనిపిస్తోంది’ అంటూ వార్నర్ చెప్పడం తనను ఆడుకోనీయకుండా అడ్డుకున్న తల్లిదండ్రులతో చిన్నపిల్లాడు బతిమాలినట్లు అనిపించింది! తన వ్యవహార శైలితో క్రికెట్ ముగిసి పోతుందని భయపడిన వార్నర్ ఏడాదిగా తాను మారే ప్రయత్నం చేశాడు. మందు మానేసి తనపై తాను స్వీయ నియంత్రణ విధించుకున్నాడు. భార్య, ఇద్దరు అమ్మాయిలు తాను మారడానికి కారణమని చెప్పుకున్నాడు.  తాను ఎదిగానని చెప్పేందుకు వచ్చిన ఐపీఎల్ కెప్టెన్సీ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.  

కొత్త ప్రయోగాలు చేయకుండా ఒకే తరహాలో తన బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలను అమలు చేశాడు. ఒక దశలో అవి రొటీన్‌గా అనిపించినా, ఫలితం ప్రతికూలంగా వచ్చినా దానినుంచి మారలేదు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌తో బౌలింగ్ ఆరంభించాలని ఎన్ని సూచనలు వచ్చినా... తాను అనుకున్నట్లుగా తన లెక్కల ప్రకారమే బౌలింగ్ చేయించాడు. మైదానంలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కాదు కదా...  ఒక్కసారి కూడా ప్రత్యర్థికి దగ్గరగా రావడం కూడా జరగలేదు. ‘ఫెయిర్ ప్లే’ ట్రోఫీ అందుకోవడం కెప్టెన్‌గా వార్నర్‌కు లభించిన పెద్ద కితాబు.  టి20 కెప్టెన్సీనుంచి స్మిత్‌ను తప్పించి వార్నర్‌కు అవకాశం ఇవ్వాలని చాపెల్, పాంటింగ్ మద్దతు పలకడం చూస్తే వార్నర్ సాధించింది ఎంత పెద్ద ఘనతో అర్థమవుతుంది.

>
మరిన్ని వార్తలు