టీమ్‌లో లేకున్నా... టీమ్‌తోనే ఉన్నా

23 Mar, 2019 11:09 IST|Sakshi

నిషేధ కాలంలోనూ ప్రోత్సహించిన సన్‌రైజర్స్‌ యాజమాన్యం

మెంటార్‌ లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన డేవిడ్‌ వార్నర్‌  

న్యూఢిల్లీ: ఏడాది పాటు నిషేధం కారణంగా గతేడాది సన్‌రైజర్స్‌ జట్టుకు దూరమైనప్పటికీ... టీమ్‌తోనే ఉన్న అనుభూతిని యాజమాన్యం కల్పించిందని ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఫైనల్‌ వరకు చేరిన సన్‌రైజర్స్‌ ప్రస్థానాన్ని తాను గమనించానని పేర్కొన్నాడు. టీమ్‌లో లేనప్పటికీ... రైజర్స్‌కు సంబంధించిన అధికారిక గ్రూప్‌ చాట్‌లో తాను భాగస్వామిగానే ఉన్నానని వార్నర్‌ తెలిపాడు. స్ఫూర్తినిచ్చే సందేశాల ద్వారా ఆటగాళ్లంతా తనను ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నాడు. గడ్డు పరిస్థితుల్లోనూ టీమ్‌ యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని చెప్పాడు. ‘ఏడాదంతా నేను ఈ సీజన్‌ కోసమే ఎదురు చూస్తుంటా. గతేడాది కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణాన్ని పరిశీలించా.

జట్టులో లేనప్పటికీ... గ్రూప్‌ సందేశాల ద్వారా జట్టుతోనే ఉన్నానన్న అనుభూతి కలిగింది. హైదరాబాద్‌ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది. టీమ్, యాజమాన్యం, అభిమానులు చూపించే ఆత్మీయత ఈ సమయంలో నాకు, నా కుటుంబానికి ఎంతో అవసరం. కఠినకాలంలోనూ వీరంతా నా వెంటే ఉన్నారు. ఇప్పుడు నేను వారికి ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే’ అని వార్నర్‌ అన్నాడు. గత సీజన్‌లో చివరి మెట్టుపై సన్‌రైజర్స్‌ కోల్పోయిన టోర్నీని ఈసారి అందుకోవడమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన సన్‌రైజర్స్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు వార్నర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘దిగ్గజ క్రీడాకారుడైన లక్ష్మణ్‌ ఎంతో వినయవిధేయతలు కలవాడు. నాలో చాలా స్ఫూర్తిని నింపాడు. అతని కారణంగానే సన్‌రైజర్స్‌ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది’ అని అన్నాడు. అస్ట్రేలియా చేతిలో భారత్‌ వన్డే సిరీస్‌ కోల్పోవడంపై స్పందిస్తూ...  చివరి రెండు మ్యాచ్‌లకు ధోని అందుబాటులో లేకపోవడంతో ఆసీస్‌కు పని తేలికైందని వివరించాడు.   

మరిన్ని వార్తలు