500 పరుగుల మార్క్‌ను దాటిన వార్నర్‌

26 Jun, 2019 18:23 IST|Sakshi

లండన్‌ : ఆస్ట్రేలియా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న తాజా ప్రపంచకప్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. లార్డ్స్‌ వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ 53 పరుగులతో  ఈ మార్కును అందుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 500 పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా, ఆస్ట్రేలియా తరపున మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో 2007 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్‌ దిగ్గజాలు మాథ్యూ హెడెన్‌(659), రికీ పాంటింగ్‌(539) పరుగులను సాధించడం విశేషం. అయితే వార్నర్‌తో పాటు మరో ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ కూడా టోర్నీలో  500 పరుగుల జాబితాలో చేరడానికి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచాడు. 2003 ప్రపంచకప్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన 673 పరుగుల రికార్డు ఇప్పటికి చెక్కుచెదరకుండా నిలిచింది.

దీంతో పాటు వార్నర్‌-ఫించ్‌ ద్వయం ప్రపంచకప్‌లో మరో రికార్డును నమోదు చేశారు. ఒకే ప్రపంచకప్‌లో 5సార్లు 50 పరుగుల భాగస్వామ్యం మార్క్‌ను దాటిన జోడిగా నిలిచింది. ఇంతకు ముందు క్రిస్‌ ట్రేవర్‌-గ్రేమి ప్లవర్‌ జోడి(1983), డేవిడ్‌ బూన్‌-జెఫ్‌ మార్ష్‌ జోడి (1987,1992), అమీర్‌ సోహైల్‌-సయీద్‌ అన్వర్‌ జోడి(1996), ఆడం గిల్‌క్రిస్ట్‌-మాథ్యూ హెడెన్‌ జోడి (2003)లో నాలుగు సార్లు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. 

 

మరిన్ని వార్తలు