మరోసారి కెప్టెన్‌గా వార్నర్‌ 

28 Feb, 2020 01:13 IST|Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణయం 

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ను ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నడిపించనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం వార్నర్‌ను సారథిగా నియమిస్తూ గురువారం ఒక ప్రకటన చేసింది. దాంతో 2018, 2019 సీజన్లలో సారథిగా వ్యవహరించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ వచ్చే సీజన్‌లో ఆటగాడి పాత్రకే పరిమితం కానున్నాడు. ‘సన్‌ రైజర్స్‌కు మరోసారి సారథిగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో జట్టును గొప్పగా నడిపిన విలియమ్సన్‌కు కృతజ్ఞతలు. జట్టును నడిపించడానికి మీ సలహాలను తప్పక తీసుకుంటా. నాకీ అవకాశం ఇచ్చిన టీం మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. రాబోయే సీజన్‌లో జట్టుకు ట్రోఫీని అందించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని వార్నర్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియోలో తెలిపాడు.

2015 నుంచి 2017 సీజన్‌లలో సన్‌ రైజర్స్‌కు సారథిగా వ్యవహరించిన వార్నర్‌... 2016లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే 2018 సీజన్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌ ఏడాది నిషేధం ఎదుర్కోవడంతో ఆ ఐపీఎల్‌ సీజన్‌లో బరిలో దిగలేదు. ఆ సీజన్‌లో సారథిగా వ్యవహరించిన విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ వరకు చేర్చాడు. ఇక 2019లో తిరిగి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌... 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ నిషేధం అనంతరం 2019 ఐపీఎల్‌ సీజన్‌లో పునరాగమనం చేసిన వార్నర్‌కు అప్పుడే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని మేనేజ్‌మెంట్‌ మొదట్లో అనుకుంది. అయితే ఏడాది విరామం అనంతరం తిరిగి బ్యాట్‌ పట్టుకున్న వార్నర్‌ ఫామ్‌పై ఉన్న అనుమానం కావచ్చు, నిషేధం ముగిసిన వెంటనే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే... అది తప్పుడు సంకేతాలకు కారణం అవుతుందనే అభిప్రాయంతో అతడిని జట్టు కెప్టెన్‌గా నియమించలేదు.

కెప్టెన్సీ మార్పుకు కారణం ఇదేనా... 
ధోనీ తర్వాత మైదానంలో అంత కూల్‌గా కనిపించేది విలియమ్సనే. అటువంటి విలియమ్సన్‌ కెప్టెన్‌గా ఉన్న సన్‌ రైజర్స్‌ 2018లో రన్నరప్‌గా నిలవడంతో పాటు... 2019లో సెమీస్‌ వరకు వెళ్లింది. 2018లో 17 మ్యాచ్‌లాడిన విలియమ్సన్‌ 735 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. దీనితో పాటు న్యూజిలాండ్‌ను మూడు ఫార్మాట్‌లలోనూ లీడ్‌ చేస్తున్నాడు. అయితే  2019లో అతను మాత్రం విఫలమయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 156 పరుగులు చేశాడు. ప్రపంచ కప్‌ సన్నాహకాల్లో భాగంగా వార్నర్, బెయిర్‌ స్టోలు జట్టును వీడిన తర్వాత జట్టుకు విజయాలను అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్‌ను బేరీజు వేసుకొని చూస్తే మరోసారి వార్నర్‌–బెయిర్‌ స్టో ద్వయం ఓపెనింగ్‌ చేపట్టే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఖాయం.  విలియమ్సన్‌ ఒకవేళ ఈ సీజన్‌లోనూ సారథిగా ఉన్నట్లయితే అతడిని అన్ని మ్యాచుల్లో ఆడించాల్సి ఉంటుంది. అలా కాకుండా వార్నర్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే... విలియమ్సన్‌ స్థానంలో జట్టు అవసరాలకు అనుగుణంగా... బౌలర్‌ని లేదా ఆల్‌రౌండర్‌ని తీసుకోవచ్చు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా