కుట్ర పన్నింది అతడే.. ఎన్నటికీ కెప్టెన్‌ కాలేడు!

28 Mar, 2018 18:31 IST|Sakshi

న్యూఢిల్లీ: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తులో ఎవరూ బాల్‌ ట్యాంపరింగ్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా ఆదర్శప్రాయమైన శిక్షలు విధించిందని చెప్పాలి. కెప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌పై అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. బాల్‌ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బౌలర్‌ కామెరాన్‌ బెన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది. అయితే, బాల్‌ ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు విచారణలో తేలింది.

అతనే కుట్రదారుడు.. ఎన్నటికీ కెప్టెన్సీ లేదు
క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన తాజా బాల్‌ ట్యాంపరింగ్‌ పథకానికి ప్రధాన సూత్రధారి డేవిడ్‌ వార్నర్‌ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తేల్చింది. బాల్‌ ఆకారాన్ని మార్చేందుకు వార్నర్‌ చేసిన పథక రచన గురించి స్మిత్‌ కూడా పూర్తిగా తెలుసునని తెలిపింది. ఈ వివాదానికి ప్రధాన కారకుడైన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బౌలర్‌ బెన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అలాగే కెప్టెన్సీ విషయంలో బెన్‌క్రాఫ్ట్‌పైనా రెండేళ్ల నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ రెండేళ్లకాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని, ఆ తర్వాత ప్రజల నుంచి, క్రికెట్‌ అభిమానుల నుంచి, క్రికెట్‌ అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే.. అప్పుడు వీరు జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. అయితే, ఈ ఏడాది నిషేధకాలంలో వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడవచ్చునని, ఇలా క్లబ్‌ క్రికెట్‌ ఆడుతూ.. క్రికెట్‌ కమ్యూనిటీతో సంబంధాలు కొనసాగించేందుకు వారిని తాము ప్రోత్సహిస్తామని తెలిపింది. ఈ మేరకు విధించిన ఆంక్షలపై అప్పీల్‌ చేసుకునేందుకు దోషులైన క్రికెటర్లకు ఏడు రోజులు గడువు ఇచ్చింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు