రెండు సింగిల్స్‌ మనవే

8 Apr, 2017 00:46 IST|Sakshi
రెండు సింగిల్స్‌ మనవే

రామ్‌కుమార్, ప్రజ్నేశ్‌ విజయం
ఉజ్బెకిస్తాన్‌పై 2–0తో ఆధిక్యం
నేడు డబుల్స్‌ మ్యాచ్‌ గెలిస్తే  వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌కు భారత్‌ అర్హత  


నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ అంచనాలకు అనుగుణంగా రాణించారు. కాస్త పోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి విజయాలు అందుకున్నారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. వరల్డ్‌ గ్రూప్‌నకు అర్హత సాధించేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది.  

బెంగళూరు: సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు మెరిశారు. ఆడిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలిపారు. డేవిస్‌కప్‌ టెన్నిస్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతోన్న పోటీలో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో 22 ఏళ్ల రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–2, 5–7, 6–2, 7–5తో తెముర్‌ ఇసామిలోవ్‌పై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో డేవిస్‌కప్‌లో తన తొలి మ్యాచ్‌ ఆడుతున్న 26 ఏళ్ల ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 7–5, 3–6, 6–3, 6–4తో సంజార్‌ ఫెజీబ్‌ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో భారత్‌కు విజయం దక్కితే సెప్టెంబరులో జరిగే ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ పోటీలకు బెర్త్‌ ఖాయమవుతుంది. ఈ పోటీలో తమ ఆశలు సజీవంగా ఉండాలంటే డబుల్స్‌లో ఉజ్బెకిస్తాన్‌ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

ఇసామిలోవ్‌తో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు రెండో సెట్, నాలుగో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. డేవిస్‌కప్‌లో తన ఏడో మ్యాచ్‌ ఆడుతోన్న రామ్‌కుమార్‌ తొలి సెట్‌లో ఇసామిలోవ్‌ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో సెట్‌లోని 12వ గేమ్‌లో రామ్‌కుమార్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఇసామిలోవ్‌ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో రామ్‌కుమార్‌ మళ్లీ విజృంభించి రెండు బ్రేక్‌ పాయింట్లు సంపాదించాడు. నాలుగో సెట్‌ హోరాహోరీగా సాగినా 11వ గేమ్‌లో ఇసామిలోవ్‌ సర్వీస్‌ను రామ్‌కుమార్‌ బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

మ్యాచ్‌ మొత్తంలో రామ్‌కుమార్‌ 16 ఏస్‌లు సంధించి, 14 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. ఫెజీబ్‌తో 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిస్‌కప్‌లో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎడంచేతి వాటం క్రీడాకారుడైన ప్రజ్నేశ్‌ మూడో సెట్‌లో 1–3తో వెనుకబడ్డా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను దక్కించుకోవడం విశేషం. నాలుగో సెట్‌లోనూ ఈ చెన్నై ప్లేయర్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. 

మరిన్ని వార్తలు