ఫేవరెట్‌గా భారత్

31 Jan, 2014 01:10 IST|Sakshi
ఫేవరెట్‌గా భారత్

 ఇండోర్: నేటి (శుక్రవారం) నుంచి చైనీస్ తైపీతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్ 1 టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నేతృత్వంలోని యువ భారత్... తైపీ జట్టుతో పోలిస్తే పటిష్టంగా ఉంది. వాస్తవానికి గతేడాది టాప్ ఆటగాళ్ల తిరుగుబాటుతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి వచ్చింది. కొరియాతో స్వదేశంలో జరిగిన పోరులో ఓటమి కారణంగా ఎలైట్ వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించకుండా గ్రూప్ 1 దశలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మాత్రం భారత్ పూర్తి స్థాయిలో సత్తా చూపేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ విజయం సాధిస్తే రెండో రౌండ్‌లో కొరియాతో ఆడాల్సి ఉంటుంది. వీరిలో విజేత ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో ఆడుతుంది.
 
  సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌తో పాటు యుకీ బాంబ్రీ జోరు మీదున్నాడు. గతేడాది సీజన్‌లో వీరు మంచి విజయాలందుకున్నారు. గత వారం హవాయిలో జరిగిన చాలెంజర్ ఈవెంట్‌లో బాంబ్రీ ఫైనల్స్‌కు చేరాడు. నేటి తొలి సింగిల్స్ మ్యాచ్‌లో తను తైపీ నంబర్‌వన్ ఆటగాడు సంగ్ హువా యంగ్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 1-0తో ఆధిక్యం అందుకోవాలనే ఆలోచనలో జట్టు ఉంది. అనంతరం సోమ్‌దేవ్.. టి చెన్‌తో రెండో సింగిల్స్ ఆడనున్నాడు.  
 
 గతంలో ఐటా నుంచి నిషేధం ఎదుర్కొన్న రోహన్ బోపన్న తిరిగి జట్టులో చేరాడు. తను సాకేత్ మైనేనితో డబుల్స్‌లో జత కట్టనున్నాడు. 2012లో బోపన్న తన చివరి డేవిస్ కప్ ఆడాడు. చెన్నై ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని సెమీస్‌కు చేరిన సాకేత్‌కు ప్రమోషన్ లభించినట్టయ్యింది. శనివారం డబుల్స్ మ్యాచ్ ఉండగా ఆదివారం రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. మరోవైపు తైపీ తమ స్టార్ టెన్నిస్ ఆటగాళ్లు ప్రపంచ 54వ ర్యాంకర్ యెన్ సున్ లూ, జిమ్మీ వాంగ్ లేకుండానే బరిలోకి దిగుతోంది.

మరిన్ని వార్తలు