భారత్ శుభారంభం

1 Feb, 2014 01:03 IST|Sakshi
భారత్ శుభారంభం

ఇండోర్: కాలి కండరాలు పట్టేసినా... పట్టుదలతో పోరాడిన యూకీ బాంబ్రీ భారత జట్టుకు శుభారంభం అందించాడు. దీంతో చైనీస్ తైపీతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోటీలో తొలి రోజు భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 6-2, 6-4, 6-7 (1/7), 6-3తో సుంగ్ హువా యాంగ్‌ను ఓడించాడు.  మూడో సెట్‌లో యూకీ కాలికి గాయం కావడంతో భారత శిబిరంలో ఆందోళన కలిగింది. కానీ ఈ యువ ఆటగాడు పోరాడి గెలిచాడు.
 
 సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, టీ చెన్‌ల మధ్య రెండో మ్యాచ్ 6-7 (4/7), 7-6 (7/3), 1-6, 6-2, 7-7 స్కోరు వద్ద వెలుతురులేమి కారణంగా శనివారానికి వాయిదా పడింది. చివరి సెట్‌లో స్కోరు 5-3తో ఉన్నపుడు సోమ్‌దేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. టీ చెన్ మూడు మ్యాచ్ పాయింట్లు కాచుకొని సోమ్‌దేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాతి గేముల్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. మైదానంలో ఫ్లడ్‌లైట్లు లేకపోవడం... వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. సింగిల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత సాకేత్ మైనేని-బోపన్న (భారత్) జోడి  యిన్ పెంగ్-హాన్ లీ (చైనీస్ తైపీ) జంటతో డబుల్స్ ఆడుతుంది.
 

మరిన్ని వార్తలు