ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!

31 Oct, 2018 14:23 IST|Sakshi

ధోని విధ్వంసానికి 13 ఏళ్లు

సాక్షి, హైదరాబాద్‌ : మహేంద్ర సింగ్‌ ధోని.. భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథి. ప్రస్తుతం నిలకడలేమి ఆటతో విమర్శకుల నోట అతని పేరు ఎక్కవగా వినిపిస్తోంది. కానీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్‌ 31 2005) విధ్వంసం సృష్టించాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి రుచిచూపించాడు. అంతకు ముందే వైజాగ్‌ వేదికగా పాకిస్తాన్‌పై 148 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ధోని శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన పవరేంటో చాటి చెప్పాడు. 7 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ధోని చెలరేగాడు. (ధోని ‘మెరుపు’ చూశారా?)

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నాటి ఓపెనర్‌ సచిన్‌ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని.. సెహ్వాగ్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెహ్వాగ్‌తో 92, ద్రవిడ్‌తో 86, యువరాజ్‌తో 65 పరుగుల భాగస్వామ్యాలు జోడించి ఈ మ్యాచ్‌లో ఒంటి చేత్తో భారత్‌కు విజయాన్నందించాడు. ఈ విధ్వంసానికి భారత్‌.. నాటి మ్యాచ్‌లో 23 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు ధోనికి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఈ భారీ ఇన్నింగ్స్‌ ను గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. చదవండి: ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ

మరిన్ని వార్తలు