‘24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించారు’

24 Mar, 2020 18:03 IST|Sakshi

1987 తర్వాత జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో అస్ట్రేలియాతో ఐదు సార్లు తలపడిన టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అప్పటి దాదా గ్యాంగ్‌ను ఘోరంగా దెబ్బ కొట్టింది పాంటింగ్‌ సేన. వెస్టిండీస్‌ వేదికగా 2007లో జరిగిన ప్రపంచకప్‌లో ఆసీస్‌తో తలపడే అవకాశం టీమిండియాకు రాలేదు. అంతేకాకుండా ఆ ప్రపంచకప్‌ టీమిండియాకు ఓ పీడకలగా మారింది. ఇక స్వదేశంలో 2011లో జరిగిన ప్రపంచకప్‌లో.. కొత్త సారథి.. ఉడుకు రక్తం.. కప్‌ గెలవాలనే కసితో బరిలోకి దిగింది భారత్‌. లీగ్‌ దశ బాగానే సాగింది. అసలు సిసలు పరీక్ష క్వార్టర్‌ ఫైనల్‌లోనే ఎదురైంది. గెలిస్తే సెమీస్‌కు.. ఓడితే ప్రపంచకప్‌లో టీమిండియా కథ కంచికే!!

జగజ్జేతగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆసీస్‌తో నాకౌట్‌ పోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సారథి రికీ పాంటింగ్‌ సెంచరీతో రెచ్చిపోగా.. బ్రాడ్‌ హాడిన్‌ అర్దసెంచరీతో అదరగొట్టాడు. చివర్లో డేవిడ్‌ హస్సీ మెరుపులు మెరిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌, జహీర్‌, యువరాజ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సచిన్‌, గంభీర్‌లు అర్థసెంచరీలు సాధించడంతో ఓ స్థితిలో గెలుపు వైపు పయనించింది. కానీ పుంజుకున్న ఆసీస్‌ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో 187 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

‘మహేంద్రుడు’ విఫలమైనా.. ‘యువరాజు’గెలిపించాడు
ఛేదనలో ఎంఎస్‌ ధోని వికెట్‌ కూడా చేజార్చుకోవడంతో టీమిండియా గెలుపు కష్టంగా మారింది. అయితే వైస్‌ కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. సురేశ్‌ రైనాతో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో అర్థసెంచరీ సాధించిన యువీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఢిల్లీ వేదికగా 1987లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో గెలిచిన భారత్‌ అనంతరం దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఇక సెమీస్‌లో పాకిస్తాన్‌పై, ఫైనల్‌ పోరులో శ్రీలంకపై గెలిచి ప్రపంచకప్‌ను టీమిండియా ముద్దాడిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మ్యాచ్‌ విశేషాలను గుర్తుచేస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా ఆ ట్వీట్‌లో యువీ వీరోచిత ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా హైలైట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

చదవండి:
గంభీర్‌ సాయం రూ. 50 లక్షలు
కోహ్లితో పోల్చకండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా