‘డీకే’ సూపర్‌ ఇన్నింగ్స్‌కు రెండేళ్లు

18 Mar, 2020 20:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకే ఒక సిక్సర్‌తో హీరో అయిపోయాడు. సూపర్‌ ఇన్నింగ్స్‌తో దేశం పరువు కాపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇది జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఆ హీరో ఎవరో కాదు ‘డీకే’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దినేశ్‌ కార్తీక్‌. దాదాపు 16 ఏళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ‘డీకే’.. 2018, మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 నిదహస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడి సూపర్‌ హిట్‌ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో చివరి బంతికి సిక్స్‌ బాది జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించడంతో అతడి పేరు మార్మోగిపోయింది. (డీ​కే విధ్వంసం సాగిందిలా...)

భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన డీకే వచ్చీరావడంతోనే విజృంభించాడు. రూబెల్‌ హొస్సేన్‌ వేసిన 19వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 6, 4, 6, 0, 2, 4 పరుగులు సాధించాడు. భారత్‌ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో దినేశ్‌ కార్తీక్‌ ఉన్నా టెన్షన్‌ తారాస్థాయిలో ఉంది. సౌమ్య సర్కార్‌ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా ఫ్లాట్‌ షాట్‌ కొట్టగా అందరూ ఫోరు అనుకున్నారు. కానీ అది బౌండరీ అవతల పడింది. అంతే టీమిండియా ఆనందోత్సాహాల్లో మునిగిపోగా, బంగ్లా ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలారు. టి20ల్లో టీమిండియాపై గెలిచే అవకాశాన్ని ‘డీకే’ దూరం చేయడంతో బంగ్లా ఆటగాళ్లు హతాశులయ్యారు. టీమిండియాకు ఘోర అవమానాన్ని తప్పించి పరువు కాపాడిన డీకేను సహచరులతో పాటు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.

>
మరిన్ని వార్తలు