విజయ ‘గంట’ మోగించాడా!

21 Jul, 2014 01:25 IST|Sakshi
విజయ ‘గంట’ మోగించాడా!

లార్డ్స్‌లో 28 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని కపిల్‌దేవ్ కూడా ఆస్వాదించనున్నాడా! మరో సారి ఆటగాళ్లతో తన ఆనందం పంచుకోనున్నాడా!  ఈ దిగ్గజం ఇప్పుడు లార్డ్స్‌లోనే ఉన్నాడు. ఈ మైదానం సాంప్రదాయం ప్రకారం రెండో టెస్టు నాలుగో రోజు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అక్కడి గంట కొట్టి ఆటను ప్రారంభించాడు. ఆదివారం భారత్ ఉన్న స్థితిలో చూస్తే లార్డ్స్‌లో రెండో విజయానికి చేరువైనట్లు కనిపిస్తోంది.
 
 గతంలో ఇక్కడ ఆడిన 16 టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకటి గెలిచి 11 ఓడిపోయింది. ఈ సందర్భంగా నాటి విశేషాలను గుర్తు చేసుకుంటే... 1986లో భారత్ ఇక్కడ గెలిచింది కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 కీలక వికెట్లు తీసిన కెప్టెన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కూడా నిలిచాడు. భారత్ 5 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. 21 టెస్టుల్లో కపిల్‌కు కెప్టెన్‌గా అదే తొలి విజయం. వికెట్ కీపర్ కిరణ్ మోరేకు అదే మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పరాజయం తర్వాత అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ డేవిడ్ గోవర్ పదవి ఊడింది. ఇప్పుడు అలిస్టర్ కుక్ కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు.

అన్నట్లు నాటి టెస్టులో రోజర్ బిన్నీ తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఆడి 9 పరుగులు చేస్తే... అతని కొడుకు  స్టువర్ట్ బిన్నీ కూడా ఇపుడు సరిగ్గా 19 బంతుల్లో 9 పరుగులే చేశాడు!
 

మరిన్ని వార్తలు