‘కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’

20 Mar, 2020 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మార్చి 20.. క్రికెట్‌ అభిమానులకు గుర్తుండిపోయే రోజు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో భాగంగా టీమిండియా రెండు కీలక మ్యాచ్‌ల్లో గెలిచింది ఇదే రోజు. ఈ రెండు సందర్భాల్లోనూ సెంచరీలతో గెలిపించి టీమిండియాను గట్టెక్కించిన ఇద్దరు లెజెండ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆ ఇద్దరూ లెఫ్టాండర్స్‌ కావడం మరో విశేషం. సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌లే ఆ దిగ్గజ ఆటగాళ్లు. కీలక సందర్భాల్లో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన ఈ ప్లేయర్స్‌..  వేర్వేరు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒకే తేదీన సెంచరీలు సాధించి.. టీమిండియా ముందడుగు వేసేలా కీలక పాత్ర పోషించారు.  

2003 ప్రపంచకప్‌.. అదే తొలి సెంచరీ
లీగ్‌, నాకౌట్‌ దశలో పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చిన కెన్యాతో టీమిండియా సెమీస్‌ పోరు. గెలిస్తే ముందుడుగు లేకుంటే పసికూన చేతిలో ఘోర అవమానం. ఈ సందర్భంలో కీలక సెమీస్‌లో అప్పటి సారథి సౌరవ్‌ గంగూలీ అన్నీ తానై పోరాడాడు. సచిన్‌ టెండూల్కర్‌ (83) సహాయంతో కెన్యాపై రెచ్చిపోయిన దాదా శతకం సాధించాడు. దీంతో నాకౌట్‌ దశలో సెంచరీ సాధించిన తొలి టీమిండియా బ్యాట్స్‌మన్‌గా దాదా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దాదా శతకం, సచిన్‌ అర్థశతకంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెన్యా భారత బౌలర్లు జహీర్‌, నెహ్రా, సచిన్‌ ధాటికి విలవిల్లాడారు. దీంతో 46.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. సెమీస్‌లో 91 పరుగుల ఘన విజయంతో ఫైనల్లో టీమిండియా సగర్వంగా అడుగుపెట్టింది. 

కక్కుకుంటూనే పోరాడాడు..
2011 ప్రపంచకప్‌ అనగానే మనకు గుర్తొచ్చే ఆటగాడు యువరాజ్‌ సింగ్‌. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీని టీమిండియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఈ స్టార్‌ ఆల్‌రౌండరే. ఇక వెస్టిండీస్‌తో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో భారత్‌ 51 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లి (59)తో యువీ ఓ యోధుడిలా పోరాడాడు. సెంచరీ సాధించి టీమిండియాకు భారీ స్కోర్‌ అందించాడు. అయితే బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో యువరాజ్‌ పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. 

అయితే  ఆ సమయంలో రక్తపు వాంతులు చేసుకున్నానని యువీ తర్వాత పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో యువీ సెంచరీ సహాయంతో టీమిండియా వెస్టిండీస్‌ ముందు 269 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌లో మెరిసన యువీ బంతితోనూ అదరగొట్టాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సెమీస్‌కు చేరుకుంది. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో లంకపై గెలిచి ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.    

చదవండి:
చహల్‌ వేషాలు మాత్రం తగ్గలేదు..
‘నేను పిచ్చి పనిచేస్తే మళ్లీ క్రికెట్‌ ఆడలేను’

మరిన్ని వార్తలు