మహిళా క్రికెట్‌లో ఓ అ‍ద్భుతం

17 Aug, 2018 16:16 IST|Sakshi
మిథాలీ రాజ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా 16 ఏళ్ల క్రితం మహిళా క్రికెట్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల అమ్మాయి అసాధారణ బ్యాటింగ్‌తో యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. క్రికెట్‌ అంటే పడిచచ్చే భారత్‌లో మహిళా క్రికెట్‌పై కూడా ఆసక్తి పెరిగేలా తొలి బీజం వేసింది. భారత్‌ తరపున తొలి డబుల్‌ సెంచరీ సాధించడమే కాకుండా అప్పటికి మహిళా టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోని ఘనతను అందుకొని శిఖరాన నిలిచింది. ఆమె ఎవరో కాదు.. రెండుసార్లు భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చిన రథసారథి, మన హైదరాబాద్‌ క్వీన్ మిథాలీ రాజ్‌. ఆమె తన కెరీర్‌లో సాధించిన డబుల్‌ సెంచరీకి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. ఈ డబుల్‌ సెంచరీని గుర్తు చేస్తూ మహిళా బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

2002, ఆగస్టు 16న ఇంగ్లండ్‌తో జరిగిన టాంటన్‌ టెస్టులో 19 ఏళ్ల మిథాలీ రెచ్చిపోయింది. 407 బంతుల్లో 19 ఫోర్లతో 214 పరుగులు చేసి భారత్‌ తరపున తొలి డబుల్‌ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. అప్పటికే వ్యక్తిగత అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత 2004లో పాక్‌ మహిళా క్రికెటర్‌ కిరణ్‌ బలుచ్‌ వెస్టిండీస్‌ 242 పరుగులు సాధించి మిథాలీ రికార్డును బ్రేక్‌ చేసింది. ఈ ఇన్నింగ్స్‌ తర్వాతే భారత మహిళా క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మిథాలీ స్పూర్తితో ఎంతో మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. 

చదవండి: ట్రోలింగ్‌కు మిథాలీ సూపర్‌ కౌంటర్‌!

మరిన్ని వార్తలు