ఆ ప్రపంచ రికార్డుకు 8 ఏళ్లు.!

24 Feb, 2018 10:15 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్‌ చరిత్రలో ఓ రికార్డు నమోదైంది. అప్పటి వరకు కనీసం ఎవరి ఊహకందని ఫీట్‌ సుసాధ్యమైంది. ఆ ఒక్క రికార్డు క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేసింది. పలు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన క్రికెట్‌ గాడ్‌, భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కరే ఈ రికార్డును సైతం నమోదు చేశాడు. అదే ప్రపంచ క్రికెట్‌లో నమోదైన తొలి డబుల్‌ సెంచరీ.. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్‌ డబుల్‌ సెంచరీ సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను సాధించి క్రికెట్‌లో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపాడు.

ఈ మ్యాచ్‌లో 147 బంతులను ఎదుర్కొన్న సచిన్‌ 25 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్‌ 401 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 153 పరుగుల తేడాతో సఫారీలపై ఘనవిజయం సాధించింది. తొలుత నెమ్మదిగా ఆడిన సచిన్‌ 90 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ వేగం పెంచి కేవలం 57 బంతుల్లోనే మరో వంద పరుగులు బాదాడు. ఇక 25 ఫోర్ల ద్వారానే 100 పరుగులు రాబట్టడం విశేషం. అప్పటికి వన్డేల్లో ఈ 200 పరుగు అత్యధికం కాగా.. మరో ఏడాదికి డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(219) పరుగులతో డబుల్‌ సాధించి గురువుకు మించిన శిష్యుడని పించుకున్నాడు. ఇక అనంతరం టీమిండియా మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఏకంగా మూడు సార్లు ఈ ఘనత సాధించి డబుల్‌ సెంచరీలు చేయడం సులవని నిరూపించిన విషయం తెలిసిందే.

గేల్‌ డబుల్‌ సైతం ఇదే రోజు.!
కాకతాళీయమో ఏమో కానీ వెస్డిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ సైతం డబుల్‌ సెంచరీ ఇదే రోజు నమోదు చేయడం విశేషం.  2015 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 24న జింబాబ్వేతో కాన్ బెర్రాలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో గేల్ 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 215 పరుగుల చేసి అవుటయ్యాడు.

మరిన్ని వార్తలు