డీకాక్ మరో ఘనత

3 Jan, 2017 13:42 IST|Sakshi
డీకాక్ మరో ఘనత

కేప్టౌన్:గతేడాది ఫిబ్రవరిలో వేగవంతంగా పది వన్డే సెంచరీలు సాధించిన రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్..ఏడాది వ్యవధిలోనే  మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీ చేసిన డీ కాక్.. తన కెరీర్లో వెయ్యి టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరపున వేగవంతంగా వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుని సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. డీ కాక్ 23 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించగా, అంతకుముందు డు ప్లెసిస్ కూడా 23 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మార్కును చేరాడు.

డీకాక్ సాధించిన వెయ్యి టెస్టు పరుగుల్లో ఎనిమిది హాఫ్ సెంచరీలు,  రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరపున వేగవంతంగా వెయ్యి టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్(17 ఇన్నింగ్స్లు), ఏబీ డివిలియర్స్(20), బార్లో(21), గ్రేమ్ పొలాక్(22) వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నారు.


గత ఫిబ్రవరిలో ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన డీకాక్  ఈ ఫార్మాట్ లో అత్యంత వేగంగా పది సెంచరీలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వేగవంతమైన పది వన్డే సెంచరీల్లో విరాట్ కోహ్లిని డీ కాక్ అధిగమించాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే,  అదే  విరాట్ 10 సెంచరీలు  చేయడానికి 23 సంవత్సరాల 159 రోజులు పట్టింది.

>
మరిన్ని వార్తలు